బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. ఆమోదించిన పార్టీ అధిష్ఠానం

Wait 5 sec.

: తమిళనాడులో రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా ఈ పార్టీలో అత్యంత గుర్తింపు పొందిన కె. అన్నామలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారుతున్నారంటూ సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ ఆయన రాజీనామా చేయగా.. బీజేపీ అధిష్ఠానం కూడా వెంటనే స్పందించి.. అన్నామలై రాజీనామాను ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. "తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కె. అన్నామలై సమర్పించిన రాజీనామాను, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన చేసిన రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుంది" అని పేర్కొంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా వేదికగా అన్నామలై ప్రజలతో మనసు విప్పి మాట్లాడే ప్రత్యక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమానికి కొన్ని గంటల ముందే ఈ అధికారిక ప్రకటన విడుదల కాగా.. అంతా ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని భావిస్తున్నారు. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. ఢిల్లీ వేదికగా సాగిన చివరి ప్రయత్నాలు..41 ఏళ్ల ఈ యువనేత మంగళవారం నాడే అత్యవసరంగా ఢిల్లీకి చేరుకుని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిశారు. సత్సంబంధాలతోనే, ఎలాంటి చేదు అనుభవాలు లేకుండానే పార్టీతో తన బంధాన్ని ముగించాలనుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే అన్నామలైలోని రాజకీయ నాయకత్వ ప్రతిభను మొదటగా గుర్తించిన కీలక నేత బి.ఎల్. సంతోష్‌లతో కూడా ఆయన వరుసగా సమావేశం అయ్యారు. అయితే అన్నామలైని తొందరపడవద్దని, కొద్దిరోజులు వేచి చూడాలని పార్టీ పెద్దలు కోరినట్లు తెలుస్తోంది. దీని కోసం తెరవెనుక ముమ్మర రాయబారాలు సాగాయి. ఇందులో భాగంగా గురువారం నాడు తమిళనాడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌ను కూడా అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది. మరో రౌండ్ సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ.. అన్నామలై తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ఎట్టకేలకు శుక్రవారం నాడు ఆయన రాజీనామాను ఆమోదించక తప్పలేదు.సొంత పార్టీ వైపు అడుగులు?బీజేపీని వీడిన అన్నామలై కొత్తగా ఓ ప్రజా ఉద్యమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన సన్నిహత వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. అన్నామలై తమిళనాడు వ్యాప్తంగా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని యువతను గుర్తించి, వారికి సరైన నాయకత్వ శిక్షణ ఇచ్చి, సరికొత్త రాజకీయ శక్తులుగా తీర్చిదిద్దడమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రజా ఉద్యమమే పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్నామలై "వి ది లీడర్స్" అనే లాభాపేక్ష లేని నాయకత్వ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ అందించిన పునాదితోనే ఆయన తన సరికొత్త, సుదీర్ఘ రాజకీయ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నారు.