తెలంగాణలో కొత్తగా రెండు నేషనల్ హైవేలు.. మంచిర్యాలకు ప్రయాణ సమయం గంటన్నర తగ్గుతుంది

Wait 5 sec.

తెలంగాణలో కొత్తగా మరో రెండు జాతీయ రహదారులకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సీసీఈఏ (ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ) సమావేశంలో ఆమోదించారు. ఈ రెండు నేషనల్ హైవేలలో ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల (ఎన్‌హెచ్‌-63), జగిత్యాల-కరీంనగర్‌ (ఎన్‌హెచ్‌-563) సెక్షన్ల అభివృద్ధి చేయనున్నారు. ఎన్‌హెచ్ఏఐ గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు హైవేలకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు ప్రక్రియను పూర్తి చేసింది. సీసీఈఏ ఆమోదంతో ఈ ఏడాది పనులు ప్రారంభంకానున్నాయి. తెలంగాణలో రెండు కొత్త నేషనల్ హైవేల కోసం రూ.7,597.16 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. మూడు ప్యాకేజీలుగా విభజించి మొత్తం 190 కిలోమీటర్లు పొడవున నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. జగిత్యాల-కరీంనగర్‌ హైవేను బీవోటీ పద్ధతిలో నిర్మిస్తారు. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల (ఎన్‌హెచ్‌-63) పనులను హ్యామ్‌ పద్ధతిలో పూర్తి చేస్తారు. ఈ కొత్త హైవే అందుబాటులోకి వస్తే ఆర్మూర్‌-మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం దాదాపుగా గంటన్నర వరకు తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే జగిత్యాల-కరీంనగర్‌ మధ్య హైవేతో 45 నిమిషాలు తగ్గనుందంటున్నారు. ఈ రెండు జాతీయ రహదారుల్ని పీఎం గతిశక్తి పథకానికి అనుగుణంగా రూపొందిస్తున్నారు. ఈ రెండు నేషనల్ హైవేలను పలు ప్రాజెక్టులకు అనుసంధానం చేయనున్నారు. వీటిలో ఆర్థిక కేంద్రాలు, సామాజిక కేంద్రాలు, లాజిస్టిక్‌ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల నేషనల్ హైవే 63 నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల మీదుగా వెళుతుంది. జగిత్యాల-కరీంనగర్ నేషనల్ హైవే విషయానికి వస్తే.. పోతారం, గంగాధర, కరీంనగర్‌ వరకు వెళుతుంది. ఈ హైవేలలో బైపాస్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. గంటలకు 100 కిలోమీటర్లు స్పీడ్ వెళ్లేలా రోడ్లను డిజైన్ చేశారు. ఈ రెండు హైవేలు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్, పలు రైల్వే స్టేషన్‌లను కనెక్ట్ చేయనున్నాయి. మొత్తం మీద త్వరలోనే కొత్త జాతీయ రహదారులు నిర్మాణం కాబోతున్నాయి. వాస్తవానికి సీసీఈఏ సమావేశంలో ఈ రెండు జాతీయ రహదారులతో పాటుగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం పనులకు సంబంధించి ఆమోదం లభిస్తుంది అనుకున్నారు.. ఆ పనులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. ఆమోదం లభించలేదు.