విజయవాడ టు వారణాసి 2 గంటల్లో వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీస్, టికెట్ ధర ఎంతంటే!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి కనెక్టివిటీపై మరింత ఫోకస్ పెట్టింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాజధాని ప్రాంతంలోని విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కొత్త సర్వీసులు ప్రారంభిస్తోంది. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాలతో పాటుగా పలు దేశాలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తాజాగా విజయవాడ నుంచి కొత్త విమాన సర్వీసు ప్రారంభంకాబోతోంది. విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి వారణాసికి నేరుగా ప్రత్యేక విమాన సర్వీసు నడిపేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇండిగా ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ విమాన సర్వీస్ నడిపేందుకు ముందుకొచ్చింది.విజయవాడ టు వారణాసి విమాన సర్వీస్ ఆగస్టు 13 నుంచి ప్రారంభించనున్నట్లు ఇండిగో తెలిపింది. ఇప్పటికే ఈ విమానంలో బుకింగ్స్‌ కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆగస్టు 13న మధ్యాహ్నం 3:55 గంటలకు వారణాసి నుంచి విమానం బయలుదేరి సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ విమానం తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6:20 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 8:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. విజయవాడ టు వారణాసి టికెట్‌ ధర దాదాపు రూ.6,500 నుంచి రూ.8 వేల మధ్య ఉంటుంది. ఈ కొత్త విమాన సర్వీసు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుందని ఇండిగో సంస్థ తెలిపింది. ఏపీ ప్రభుత్వం కొత్తగా విమానయాన పాలసీ (ఏవియేషన్‌ పాలసీ)ని తీసుకొచ్చింది. విమానయాన పెట్టుబడుల్ని ఆకర్షించేలా పాలసీని తీర్చిదిద్దారు. 2026 నుంచి 2031 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 2030 నాటికి ఏరోస్పేస్‌ తయారీ రంగంలో రూ.9,575 కోట్లకు (1 బిలియన్‌ డాలర్లు) పైగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంఆర్‌వో, ఏరోస్పేస్‌ తయారీ రంగాల్లో ఏటా 5వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్జాతీయ కనెక్టివిటీతో పాటుగా ఉడాన్ పథకం కింద దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు, కార్గో కనెక్టివిటీ పెంచుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల నెట్‌వర్క్‌ విస్తరణ.. వాటర్‌డ్రోమ్స్, హెలిపోర్ట్స్, కార్గో హబ్‌లను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేశారు. 'అమరావతి విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడం.. రాష్ట్రంలో కొత్తగా దగదర్తి, కుప్పం, అమరావతి, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, అనంతపురం ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధి. రాష్ట్రంలో ప్రతి 150 కి.మీ. పరిధిలో ఒక విమానాశ్రయం..7 లో-కాస్ట్‌ విమానాశ్రయాల ఏర్పాటు..10కిపైగా వాటర్‌ డ్రోమ్స్, హెలిపోర్ట్‌ల అభివృద్ధి, రాజధాని నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పట్టణాలకు విమాన సర్వీసులు. రాష్ట్రంలోని ముఖ్యమైన విమానాశ్రయాల నుంచి దేశంలోని 25కుపైగా ప్రాంతలకు కనెక్టివిటీ. అలాగే రాష్ట్రం నుంచి 10కిపైగా అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించడం' అవంటి లక్ష్యాలను పెట్టుకున్నారు.