: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేగుతోంది. సీఎం డీకే శివకుమార్ క్యాబినెట్‌లో సీనియర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం రెండు రోజులకే.. సీనియర్ నేత ఆర్‌. రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం నాడు తనకు కేటాయించిన శాఖ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం బెంగళూరు నగరంలోనే ఉన్న సమయంలో.. ఈ పరిణామం చోటుచేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.సీఎం మాట తప్పారంటూ..!రాజీనామాకు గల కారణాలను రామలింగారెడ్డి బహిరంగంగానే వెల్లడించారు. ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మాట తప్పారని తీవ్ర ఆరోపణలు చేశారు. 2023లోనే ఈ శాఖకు సంబంధించి తనకు ఒక స్పష్టమైన హామీ లభించిందని ఆయన గుర్తు చేశారు. రెండున్నరేళ్ల తర్వాత డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక.. ఆ శాఖను పూర్తిగా తనకు అప్పగిస్తారనే ముందస్తు అవగాహన తమ మధ్య కుదిరిందని.. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయని రామలింగారెడ్డి పేర్కొన్నారు.పదే పదే అవమానించారు.. భరించలేకే ఈ నిర్ణయం!శాఖల కేటాయింపు వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసిన రామలింగారెడ్డి.. "నన్ను పదే పదే అవమానాలకు గురిచేశారు. ఇక ఎంతమాత్రం దీనిని నేను భరించలేను. నా అంతరాత్మను చంపుకుని నేను మంత్రిగా పని చేయలేను" అని స్పష్టం చేశారు. అయితే తాను కేవలం మంత్రి పదవి నుంచి మాత్రమే తప్పుకుంటున్నానని, ప్రకటించారు. 53 ఏళ్లుగా తాను కాంగ్రెస్ నమ్మకమైన సైనికుడిగా ఉన్నానని.. కేవలం మంత్రిత్వ శాఖల కేటాయింపులో జరిగిన అన్యాయంపై నిరసనగా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. అలాగే తాను ఎమ్మెల్యేగా పార్టీలోనే ఉంటానని వెల్లడించారు.తాను ఎవరిపైనా వ్యక్తిగత కోపంతో లేనని.. కేవలం నాయకత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర నిరాశకు గురయ్యానని రామలింగారెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన నిరసనను వ్యక్తం చేస్తూ.. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి స్వయంగా కలిసి ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. తన పర్సనల్ సెక్రటరీ ద్వారా సీఎం కార్యాలయానికి రాజీనామా లేఖను పంపించారు. కర్ణాటక మంత్రివర్గంలో అంతర్గతంగా శాఖల సర్దుబాటుపై తీవ్ర చర్చలు నడుస్తున్న తరుణంలో.. రామలింగారెడ్డి లాంటి సీనియర్ నేత తిరుగుబావుటా ఎగురవేయడం కాంగ్రెస్ హైకమాండ్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.