హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.. అందుకు తగిన విధంగా మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించింది. ముఖ్యంగా నగరంలో రోజు, రోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. భాగ్యనగరంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్కైవేలను నిర్మిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్ (బై డైరెక్షనల్‌ గ్రేడ్‌ సెపరేటర్‌) నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాటేదాన్‌ టు శంషాబాద్‌ రోడ్‌ వయా మైలార్‌దేవ్‌పల్లి మీదుగా ఆరు లేన్ల ఈ ఫ్లైఓవర్ప్లాన్ చేసింది. మొత్తం రూ. 189.68 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ ప్రక్రియ పూర్తికాగా.. తాజాగా ఏజెన్సీ ఎంపికకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం హెచ్‌-సిటీ (హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ ట్రాన్స్‌ఫర్మేటీవ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)లో భాగంగా ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాల రాకపోకలు సాగించేలా ఈ నిర్ణయం తీసుకుంది. కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌వైపు రాకపోకలు సాగించేవారితో పాటుగా, స్థానికంగా ఉండే ట్రాఫిక్‌తో పాటుగా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ కారణంగానే తరచూ ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు.. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ కోసం ఈ వంతెన ప్లాన్ చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి మొత్తం రూ.189.68 కోట్లతో మూడు జంక్షన్‌ల దగ్గర సిగ్నల్‌ ఫ్రీ జర్నీ కోసం బ్రిడ్జిని ప్రతిపాదించారు. ఈ వంతెనకు సంబంధించిన టెండర్ విషయానికి వస్తే.. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌ను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరో రెండు కాంట్రాక్ట్ సంస్థలు కూడా బిడ్‌లు దాఖలు చేయగా.. అంచనా కంటే ఎక్కువ కోట్ చేశాయి. కేఎన్‌ఆర్‌ కాంట్రాక్ట్ సంస్థ మాత్రం 189.68 కోట్లు (4.71 శాతం) కోడ్ చేసింది. అధికారులు టెక్నాలజీతో పాటుగా ప్రైస్ బిడ్‌ను పరిశీలించారు.. ఆ వివరాలను జీహెచ్‌ఎంసీ మున్సిపల్ శాఖకు పంపించింది. అనంతరం ఎల్‌-1 బిడ్డర్‌గా ఉన్న కేఎన్‌ఆర్‌ సంస్థను ఎంపిక చేస్తూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు వెంతన నిర్మాణ పనులు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.హైదరాబాద్ సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు.. వారికి ఊరట దక్కనుంది. అలాగే ఫలక్‌నుమా, బహదూర్‌పురా, బండ్లగూడ, చాంద్రాయణగుట్టతో సహా పలు ప్రాంతాలవారికి వినామాశ్రయానికి రాకపోకలు సులువు కానున్నాయి. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవని చెబుతున్నారు. ఇప్పటికే కేబీఆర్‌ పార్కు జంక్షన్‌, ఫాక్స్‌ సాగర్‌ బ్రిడ్జి, గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్‌ ఏరియాల్లో బ్రిడ్జిల నిర్మాణం ప్రారంభించారు. వీటితో పాటుగా పంజాగుట్టలోని ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌, అల్వీన్‌ కాలనీ, రసూల్‌పుర జంక్షన్ల దగ్గర కూడా ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది.