‘యువ శకం’.. బెంగళూరుకు భారీ నిధులు.. డీకే శివకుమార్ తొలి క్యాబినెట్‌లో సంచలన నిర్ణయాలు

Wait 5 sec.

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా యువతే లక్ష్యంగా విద్యార్థులకు ఉచిత బస్సు పాస్‌లు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ పునరుద్ధరణ, ‘భారత్ జోడో’ యువజన సంఘాల ఏర్పాటు, బెంగళూరు రహదారుల కోసం రూ. 2,000 కోట్లు కేటాయింపులు వంటి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బుధవారం ప్రమాణస్వీకారం ముగిసిన కొద్దిసేపటికే విధాన సౌధలో మంత్రివర్గం సమావేశమైంది. దాదాపు రెండు గంటల పాటు సాగిన భేటీలో రాష్ట్ర రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చించారు. రైతాంగం సమస్యలపై నిపుణులు, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి కొత్త పథకాలను రూపొందించాల్సి ఉన్నందున ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం శివకుమార్ వెల్లడించారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘తొలి మంత్రివర్గ సమావేశంలో మేము ‘యువశకం’ అనే కొత్త కానుకను ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నాం.. అన్నదాతల విషయానికి వస్తే నిపుణులు, అధికార యంత్రాంగంతో సంప్రదించి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి.. కేవలం వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి’’ అని శివకుమార్ అన్నారు.‘‘రైతుల సమస్యల పరిష్కారానికే మా మొదటి ప్రాధాన్యత. ఉపాధి, విద్య, ఉద్యోగాల కోసం యువత నగరాలకు వలస వెళ్లకుండా నిరోధించాలి... వ్యవసాయం, ఉద్యానవన, పాడి పరిశ్రమ పట్ల మనకున్న సంకుచిత ఆలోచనా విధానాన్ని వదిలిపెట్టాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లో ఉండగా.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్సు పాస్‌లను అందజేయనున్నారు.అమ్మాయిలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని, తమకు ఎందుకు ఇవ్వలేదని యువకులు అడిగేవారని, అందుకే వారికి ఫ్రీ పాస్‌లను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే, ప్రైవేట్ రంగంలో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలను పునరుద్ధరిస్తామని శివకుమార్ చెప్పారు.కర్ణాటక వ్యాప్తంగా‘భారత్ జోడో’ పేరుతో 10,000 యువజన సంఘాలను ప్రారంభించనున్నామని డీకే పేర్కొన్నారు. ప్రతి సంఘంలో 150 నుంచి 200 మంది యువకులు చొప్పున పంచాయతీకి ఒక యువజన సంఘం, పట్టణాల్లో వార్డు స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేస్తారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, సామాజిక సామరస్యం, యువత ప్రతిభను చాటుకోవడానికి ఇది ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు. ప్రతి సంఘానికి రూ.10 లక్షలు గ్రాంటు ప్రభుత్వం అందించనుంది. బెంగళూరులో రహదారుల కోసం రూ.2,000 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. ప్రస్తుత ఉన్న ప్రాజెక్ట్‌ల పరిధిలోకి రాని నగరంలోని అన్ని రహదారులపై తారు పనులు కోసం నిధులు మంజూరుచేసినట్టు వివరించారు.