హీరో రణవీర్ సింగ్‌కు ఊరట.. బ్యాన్ ఎత్తివేస్తూ కీలక ప్రకటన

Wait 5 sec.

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ 'బ్యాన్' వివాదం గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘డాన్ 3’ సినిమా నుంచి రణవీర్ వైదొలగడంతో ఫర్హాన్ అక్తర్‌కు చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌’ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) రణ్‌వీర్‌పై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఈ వివాదంలో రణ్‌వీర్‌ సింగ్ కు ఊరట లభించింది. అతడిపై నిషేధం ఎత్తివేస్తూ సినీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ కీలక [ప్రకటన చేసింది. రణవీర్ సింగ్ విధించిన నాన్‌ కో-ఆపరేషన్‌ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ బుధవారం వెల్లడించింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించింది. రణవీర్ లీగల్‌ నోటీసులు పంపిన నేపథ్యంలో, ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ఆయనపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు FWICE అధ్యక్షుడు బీఎన్‌ తివారీ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ అంశంపై ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బృందంతో చర్చలు జరిపి, వివాదాన్ని పరిష్కరించుకోవాలని రణవీర్ సింగ్ కి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.రణవీర్ సింగ్ హీరోగా బాలీవుడ్‌ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ‘డాన్‌ 3’ సినిమాని ప్రకటించారు. అయితే ఈ చిత్రం రణవీర్ తప్పుకున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశామని, ఇప్పుడు రణవీర్ వైదొలగడం వల్ల రూ.45 కోట్లమేర నష్టపోయామని నిర్మాతలు ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి రణవీర్ సహకరించడంలేదని, నిర్మాతల సంస్థతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునే వరకూ ఆయనతో కలిసి పని చేయవద్దని ఆదేశిస్తూ ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రకటన జారీ చేసింది. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తనపై నిషేధం విధించడంపై మంగళవారం రణవీర్ సింగ్ లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో ఆయనపై బ్యాన్ ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై FWICE చీఫ్‌ అడ్వైజర్‌ అశోక్‌ పండిట్‌ మాట్లాడుతూ.. నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని రణవీర్ కోరినట్లు తెలిపారు. ఈ అంశంపై మేకర్స్ తో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని తాము విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఇండస్ట్రీలో ఎవరిపైనా బ్యాన్ విధించే హక్కు తమకు లేదని అశోక్ స్పష్టం చేశారు. దీనిపై రణవీర్ సింగ్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.