తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం మరోసారి స్పందించారు. అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్.. పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇంకా ప్రాంతీయ నినాదం ఉనికిలో ఉందన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో మాత్రం ఆంధ్ర అనే ఉనికి లేదన్నారు. హైదరాబాద్‌లో తన సమావేశానికి అనుమతి ఇచ్చి ఉంటే సాదాసీదాగా సాగిపోయేదని.. ఈ వివాదం తలెత్తేది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల గురించి తానెప్పుడూ చెడుగా మాట్లాడలేదని.. తెలంగాణ ప్రాంతం ఎప్పటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ భూమిపుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరాలు ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా, నటుడిగా పవన్ కళ్యాణ్ అంటే తమకు గౌరవం ఉందని.. అయితే తెలంగాణ సచివాలయంలో కూర్చుని పెత్తనం చెలాయిస్తామంటే మాత్రం అంగీకరించమని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఆయన తనకు సోదరుడిలాంటి వారని అన్నారు. ఆయన ఏమన్నారో పూర్తిగా వినలేదని.. కచ్చితంగా తన గురించి తప్పుగా మాట్లాడి ఉండరని అభిప్రాయపడ్డారు. ఇక ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం, ప్రాంతీయవాదం వేర్వేరని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. విభజించుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తామని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదన్న జనసేనాని.. జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులే పోటీచేస్తామంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలోని నా ఇంటికి వెళ్లకూడదా.. పవన్ కళ్యాణ్మరోవైపు తెలంగాణలో తనకు ఇల్లు ఉందన్న పవన్ కళ్యాణ్.. అక్కడికి కూడా వెళ్లకూడదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఘటనలు సీఎం రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతున్నాయని అనుకోవడం లేదన్నారు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలే పనిగట్టుకుని విద్వేషాలు రేపుతున్నారని ఆరోపించారు. ప్రాంతీయ విద్వేషాలకు ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.