టీఎంసీలో తిరుగుబాటు.. మమతా బెనర్జీ సంచలన నిర్ణయం

Wait 5 sec.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్నడూలేనంత సంక్షోభాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎదుర్కొంటోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత టీఎంసీకి ఇటువంటి గడ్డు పరిస్థితి ఎదురుకావడం ఇదే మొదటిసారి. అంతర్గత సంక్షోభం, భారీ తిరుగుబాటు నేపథ్యంలో అధినేత్రి బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ సంఘాలన్నింటినీ తక్షణమే రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘‘క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ అన్ని కమిటీలు, అలాగే దాని అనుబంధ సంస్థలన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించడం జరిగింది’’ అని తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో టీఎంసీ పోస్ట్ పెట్టింది.టీఎంసీ నుంచి ఎన్నికైన కనీసం 58 మంది ఎమ్మెల్యేలు అధినేత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా రీతబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న గంటలోపే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడారనే ఆరోపణలపై టీఎంసీ ఎమ్మెల్యేలు రీతబ్రత బెనర్జీ, సాందీపన్ సాహాలను మమతా బెనర్జీ సోమవారం పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి సస్పెండ్‌ గురయ్యేంత వరకు తృణమూల్ ట్రేడ్ యూనియన్ విభాగానికి రీతబ్రత నాయకత్వం వహించారు.పదిహేనేళ్ల పాటు బెంగాల్‌ను పాలించి టీఎంసీ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత శరవేగంగా కుప్పకూలుతోంది. ఆ పార్టీ నాయకులలో చాలామంది కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలోని ఎన్నికైన ప్రజాప్రతినిధులలో చాలామంది సామూహికంగా రాజీనామా చేయడం లేదా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులలో అరెస్టు అయ్యారు.అయితే, ఆత్మపరిశీలన చేసుకుని, సంస్థను కొత్తగా పునర్నిర్మిస్తామని తృణమూల్ తెలిపింది. ‘‘పార్టీ ప్రతి స్థాయిలో సమగ్రమైన ఆత్మపరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత మదింపు ప్రక్రియను చేపడుతుంది.. ఈ ప్రక్రియ ఫలితాల ఆధారంగా సంస్థాగతంగా అన్ని విభాగాలను పునర్నిర్మించి, తగిన సమయంలో ప్రకటన చేస్తాం.. ‘‘పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, భవిష్యత్ సవాళ్లను నూతన ఉత్సాహంతో ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడానికి కట్టుబడి ఉంది’’ అని పేర్కొంది.