ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సంచలనం మోనాలిసా భోంస్లే, ఆమె భర్త మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. మతాంతర వివాహంతో మొదలైన ఈ కేసు, రెండు రాష్ట్రాలకు విస్తరించిన ఒక సంక్లిష్టమైన చట్టపరమైన, రాజకీయ వివాదంగా పరిణమించింది. వివాహ చట్టబద్దత, వధువు వయసు, దంపతులు ఎదుర్కొంటోన్న వేధింపుల ఆరోపణలపై ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు పూర్తికావడంతో తీర్పును బుధవారం వెలువరించే అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ జంట బెదిరింపులను ఎదుర్కొంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేరళలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నారని కోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించడం ఈ విచారణ నాటకీయ మలుపు తీసుకుంది.‘‘మీరు కేరళంలో ఉండటం అదృష్టం’’ అని న్యాయమూర్తి జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ వ్యాఖ్యానించగా.. దంపతుల తరఫు న్యాయవాది ‘‘మేము ఇప్పుడు ప్రాణాలతో ఉండటానికి అదే ఏకైక కారణం’’ అని బదులిచ్చారు. గతేడాది ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ కట్టిపడేసే అందం, చిరునవ్వుతో సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది మోనాలిసా. ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే, ఆన్‌లైన్‌లో ఫర్మాన్ ఖాన్‌తో పరిచయం ప్రేమగా మారడంతో ఈ ఏడాది మార్చి 11న కేరళలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు.వివాహ సమయానికి ఆమె వయసు 16 ఏళ్లేనని, మైనర్ అనే ఆరోపణలు రావడంతో పెను దుమారం రేపింది. ఈ జంట తరఫున వాదనలు వినిపించిన లాయర్ ఎం. శశీంద్రన్.. మోనాలిసాను మైనర్‌గా చిత్రీకరిస్తూ మత ఛాందసవాదులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు ఈ వివాహాన్ని చెల్లుబాటు కాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దంపతుల వాదన ప్రకారం.. వివాహం సమయానికి మోనాలిసాకు 18 ఏళ్లు నిండాయి కానీ, ఉద్దేశపూర్వకంగానే అధికారిక రికార్డులను తారుమారు చేశారని తెలిపారు.మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తీవ్రంగా వ్యతిరేకించారు. అతడు ముస్లిం అయినప్పటికీ, హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగడంతో ఆ వివాహమే చట్టబద్ధంగా నిలవదని ఆయన వాదించారు. మోనాలిసా పుట్టిన తేదీ డిసెంబర్ 2009 కావడం వల్ల వివాహ సమయానికి ఆమె మైనర్ అని, పోక్సో చట్టం నిబంధనలు ఆమెకు వర్తించే అవకాశం ఉందని అన్నారు.బర్త్, మ్యారేజ్ సర్టిఫికెట్ పొందడానికి నకిలీ పత్రాలను ఉపయోగించారని ఆరోపించిన ఆయన.. ఖాన్‌పై నమోదు చేసిన కిడ్నాప్ కేసులో ఫోర్జరీకి సంబంధించిన అభియోగాలను కూడా చేర్చాలని కోర్టుకు తెలియజేశారు. అయితే, మోనాలిసా స్వయంగా తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ప్రభుత్వం చేసిన వాదనలోని అంశాలను ప్రశ్నించారు. మోనాలిసా వైరల్ ఫేమ్ కావడమే కాకుండా, కేరళ, మధ్యప్రదేశ్ కోర్టులలో సమాంతరంగా విచారణలు నడస్తుండటంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది. కాగా, ఈ వివాహాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలపై ఫర్మాన్ ఖాన్‌తో పాటు ఎంవీ గోవిందన్, వి శివన్‌కుట్టి, ఏఏ రహీమ్ పలువురిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువనంతపురం పోక్సో కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. వ్యక్తిగత స్వేచ్ఛ, మతాంతర వివాహం, వయసు నిర్దారణ వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసులో హైకోర్టు వెలువరించబోయే తీర్పు ఆ దంపతుల భవిష్యత్తు, చట్టపరమైన పోరాటాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.