కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సీఎంలు, మంత్రులు లేదా ప్రజాప్రతినిధులు రాజ్యాంగం పట్ల విధేయతతో ఉంటామని ప్రమాణం చేస్తారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రక్రియ. కానీ, కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఒక విభిన్నమైన పేరును చెబుతూ డీకే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. పేరుతో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఇంతకీ ఈ గంగాధర అజ్జయ్య ఎవరు? డీకే శివకుమార్‌కు ఆయనతో ఉన్న సంబంధం ఏమిటి? ఆయనపై ఎందుకు ప్రమాణం చేశారు? అనే చర్చ జరుగుతోంది. అయితే, సిద్ధరామయ్య ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు కూడా అజ్జయ్య స్వామి పేరును ఉచ్ఛరించారు.డీకే శివకుమార్‌కు గంగాధర్ అజ్జయ్య అంటే చాలా నమ్మకం. తన కష్టసుఖాల్లోనూ ఆయననే స్మరించుకుంటారు. తుమకూరు జిల్లా నొణవినకెరెలోని కాడసిద్ధేశ్వర మఠం మాజీ పీఠాధిపతే ఈ అజ్జయ్య స్వామి. ఆయనను గురువుగా భావించే శివకుమార్.. ఏ పనిచేసిన ముందు ఆయననే తలుచుకుంటారు. రాష్ట్రాన్ని ఏలుతావని కు చిన్నతనంలోనే జోస్యం చెప్పినట్టు డీకే వెల్లడించారు. ఆయన అనుగ్రహంతోనే తాను ఎమ్మెల్యే, మంత్రి, డిప్యూటీ సీఎం, ఇప్పుడు ముఖ్యమంత్రిని అవుతున్నానని ప్రమాణస్వీకారానికి ముందు పేర్కొన్నారు. నొణవినకెరె గ్రామంలో కాడసిద్ధేశ్వర మఠం పురాతన ఆశ్రమం. దాని పూర్తి పేరు సోమకట్టె కాడసిద్ధేశ్వర మఠం. ఈ మఠాధిపతే గంగాధర్ అజ్జయ్య. ఈ మఠానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వకాలంలో కాడసిద్ధేశ్వరుడు నంది నదిని దాటి నోణవిన సరస్సుకు దక్షిణాన ఉన్న అడవికి చేరుకుని తపస్సు చేశాడట. ముడియప్ప నాయక అనే రాజు వేటాడటానికి వచ్చి, ఆయనను ఒక జంతువు అనుకుని బాణం వేశాడు, కానీ ఆ బాణం తగిలినా ఏమీ జరగలేదట. దీంతో కాడసిద్ధేశ్వరుడ్ని చూసి తన తప్పును గ్రహించిన ముడియప్ప నాయక కన్నీరు పెట్టుకున్నాడట, చివరకు అతన్ని క్షమించి వరం ప్రసాదించాడట.తరువాత, ఆయనే స్వయంగా ఆ మఠాన్ని నిర్మించాడని, ఒక అర్ధరాత్రి, కాడసిద్ధేశ్వరుడ్ని బంగారు పల్లకిలో తీసుకొచ్చినప్పుడు, అక్కడ కర్పూర జ్యోతి వెలిగిన వెంటే ఆ సాధువు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడట. సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మికత, మత ప్రచారం, విద్యతో సహా ఈ మఠాన్ని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సందర్శిస్తారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ కూడా ఈ మఠానికి భక్తుడే. అక్కడ స్వామీజీ చెప్పే భవిష్యవాణిని అందరూ నమ్ముతారు. డీకే శివకుమార్‌కు కూడా అజ్జయ్య స్వామిపై అపార నమ్మకం.