: బంగారం శుద్ధి, ఆభరణాల తయారీ రంగంలోని దిగ్గజ కంపెనీల్లో ఒకటైన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ గడిచిన 5 సంవత్సరాల కాలంలో తన ఏకీకృత ఆదాయాలను రూ.15 లక్షల కోట్లకు పైగా ఎక్కువ చేసి చూపించినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఆరోపించింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తన విదేశీ అనుబంధ కంపెనీల్లో, ప్రధానంగా స్విట్జర్లాండ్‌కు చెందిన వాల్కంబి ఎస్‌ఏకే కంపెనీలో అధిక ఆదాయం చూపించినట్లు ఆరోపించింది. అయితే వాల్కంబి ఎస్‌ఏకే స్టాండలోన్ ఆర్థిక లెక్కలు చూస్తే అతి తక్కువ మొత్తమే ఉన్నట్లు సెబీ పేర్కొంది. ఈ క్రమంలోనే భారీ మోసం జరిగినట్లు అనుమానిస్తున్నామని తెలిపింది. కంపెనీ సెక్యూరిటీల నిర్వహణ చేయకుండా నిషేధం విధించింది. అయితే, ఈ విషయంపై కంపెనీ వివరణ ఇచ్చింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఎక్కడో సమాచార లోపం ఉన్నట్లు అనిపిస్తోందని పేర్కొంది.'సెబీ నుంచి మధ్యంతర ఆదేశాలు మాత్రమే కానీ తుది నిర్ణయం కాదు. కంపెనీ ప్రకటించిన ఆదాయం పూర్తిగా నిజం. కంపెనీలో ఎలాంటి తప్పు జరగలేదు. 5 ఏళ్లలో రూ.15.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం విషయంలో సెబీ తప్పుగా అర్థం చేసుకున్నట్లుంది. 2 ఏళ్ల గణాంకాలనే సెబీ లెక్కలోకి తీసుకుంది. తప్పు జరిగినట్లు భావిస్తున్నాం అని పేర్కొంది తప్పితే నిర్దారించలేదు. రూ.15.5 లక్షల కోట్ల ఆదాయం అనేది పూర్తిగా నిజం. మేము ఎటువంటి ఆర్థిక అవకతవకలకూ పాల్పడలేదు. ఆదాయాలు అన్నీ సరిగానే నివేదించాం. సెబీకి, కంపెనీకి మధ్య సమాచార లోపం ఉన్నట్లుగా అనిపిస్తోంది.' అని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ గురువారం ఓ ప్రకటన చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఖాతా పుస్తకాల్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని 2024 మార్చిలో కంపెనీ వాటాదారు ఒకరు సెబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సెబీ దర్యాప్తు జరిపింది. 109 పేజీల తాజా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా తప్పుదోవ పట్టించేలా గణాంకాలు చూపించినట్లు ఆరోపించింది. 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ఏకీకృత ఆదాయాలు రూ.15.18 లక్షల కోట్లుగా కంపెనీ చూపించగా తమ అనుబంధ కంపెనీల నుంచే ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొందని, అయితే వాల్కంబి ఎస్‌ఏకు చెందిన ఆడిటెడ్ స్టాండలోన్ ఆర్థిక గణాంకాలకు అవి సరిపోవడం లేదని పేర్కొంది.కేపీఎం‌జీ ఎస్ఏ చేసిన ఆడిట్లో కేవలం ప్రాసెసింగ్ ఛార్జీలు, వాల్యూ అడిషన్‌నే ఆదాయంగా ఆ సంస్థ చూపించింది. 2023లో వాల్కంబి ఎస్ఏ స్టాండలోన్ ఆదాయం రూ.543 కోట్లు ఉంటే రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ దాని ఇంటర్మీడియరీ హోల్డింగ్ కంపెనీ అయిన గ్లోబల్ గోల్డ్ రిపైనరీస్ ఏకీకృత ఆదాయాలు వరుసగా రూ.2.93 లక్షల కోట్లు, రూ.2.81 లక్షల కోట్లుగా రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. అంటే ఏకీకృత ఆదాయాల్లో స్టాండలోన్ ఆదాయం 0.5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఎలాంటి స్వతంత్ర నిర్వహణ లేని ఒక హోల్డింగ్ కంపెనీ, తన అనుబంధ కంపెనీ ద్వారా ప్రాసెసింగ్ ఫీజును ఆదాయంగా పొందే కంపెనీ నుంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఎలా పొందిందని సెబీ ప్రశ్నించింది.