రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రోడ్డునపడ్డ 700 మంది ఉద్యోగులు.. సీఈఓ అరెస్ట్!

Wait 5 sec.

: కొంత కాలంగా ఐటీ రంగం తీవ్ర అనిశ్చితిలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఏఐకి డిమాండ్ పెరుగుతుండగా.. సంప్రదాయ ఐటీ సేవలు అందించే కంపెనీలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏఐ వినియోగాన్ని పెంచేందుకు ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. చాలా వరకు లేఆఫ్స్ విధిస్తున్నాయి. లేఆఫ్స్ వరకైతే పర్లేదు. కానీ ఏకంగా కంపెనీ మొత్తాన్ని మూసేస్తే.. పరిస్థితి ఏంటి.. ఇంకా వారికి సరిగా జీతాలు చెల్లించకుండా.. వారి దగ్గరే డబ్బులు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఇప్పుడదే జరిగిందే. పుణె హింజేవాడి ఐటీ హబ్‌లో ఏడాది కిందట స్టార్ట్ అయిన ఒక ఐటీ స్టార్టప్‌ను సడెన్‌గా మూసేశారు. అకస్మాత్తుగా కార్యకలాపాల్ని నిలిపివేసింది. దీంతో వందలాది ఐటీ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇంటర్న్స్ రోడ్డునపడ్డారు. హైశాలరీలు, ల్యాప్‌టాప్స్ ఇస్తామని.. మంచి కెరీర్ ఉంటుందని.. స్థిరమైన జీతాలు ఇస్తామని ఇలా ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించి.. చేరిన యువకుల్ని భారీ మోసం చేసింది. 2025లోనే భారీ స్థాయిలో ఫ్రెషర్లను నియమించుకుంది. ఈ ఏప్రిల్‌లో ఒక్కసారిగా మూతపడింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది యాజమాన్యం. జనవరి నుంచి జీతాలు కూడా చెల్లించలేదు. ఇచ్చిన చెక్స్ కూడా బౌన్స్ అయ్యాయి. ఆఫీసుకు వెళ్లిన ఉద్యోగులు.. తాళం వేసి ఉండటం చూసి షాకయ్యారు. 700 మందికిపైగా ఉద్యోగులు.. వీరిలో చాలా వరకు ఫ్రెషర్లు (తాజా ఉత్తీర్ణులు) ఉండటం గమనార్హం. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ప్రారంభంలో ఒక్కొక్కరి నుంచి రూ. 15 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో వసూలు చేసి.. ఆ డబ్బును మిస్ యూజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కొందరికి ల్యాప్‌టాప్స్ ఇవ్వకపోగా.. ఇంకా డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వలేదని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో.. ఐటీ ఉద్యోగుల ఫోరమ్ FITE ఆధ్వర్యంలో హింజేవాడి పోలీసులు.. సీఈఓ హర్షల్ ఠాక్రే సహా మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్‌ను మోసం, నమ్మక ద్రోహం ఆరోపణలతో అరెస్ట్ చేశారు.గత 8 నెలల్లో చూస్తే ఇది పుణెలో మూతబడిన ఐదో కంపెనీ అని తెలుస్తోంది. మొత్తం మీద 4 వేల నుంచి 5 వేల మంది వరకు ఉద్యోగులు ప్రభావితమయ్యారని సమాచారం. ఈ ఘటన ఐటీ రంగంలో స్టార్టప్స్ పేరిట జరుగుతున్న మోసాన్ని మరోసారి గుర్తుచేసిందని చెప్పొచ్చు. ఇది ఉద్యోగ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చేరే ముందు కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని హెచ్చరిస్తోంది. ఇక్కడ చాలా మంది చదువు ముగిసిన వెంటనే చేరిన తొలి ఉద్యోగం కాగా.. ఇక్కడ జీతం కంటే తమ ఉద్యోగ జీవితంపైనే ఎక్కువ ప్రభావం చూపిందని చెప్పొచ్చు. వారందరికీ కలల ఉద్యోగంగా కనిపించిన అవకాశం.. చేదు అనుభవాన్ని మిగిల్చింది.