ఏపీలో టెట్ షెడ్యూల్.. పరీక్ష రాయబోయేవారికి ముఖ్యమైన గమనిక, ఇలా చేయండి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) షెడ్యూల్‌ విడుదలైంది. ఇవాళ టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతోడీఎస్సీ పరీక్ష రాయబోయే అభ్యర్థులతో పాటుగా ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకూ టెట్‌ రాయాల్సిందే. రోజుకు రెండు విడతలుగా టెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు ఉదయం 9.30 గంటలకు మొదలై 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక జాబ్ క్యాలెండర్‌లో భాగంగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం DSC–2026 నోటిఫికేషన్ అక్టోబర్ 2026లో జారీ చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. AP TET–2026కు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ ఆశావహులందరికీ, ప్రస్తుతం సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థుల కోసం నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్, సిలబస్, సూచనలతో పాటుగా విధివిధానాలు, ఇతర వివరాలను వెబ్‌సైట్‌ http://tet2dsc.apcfss.inలో అందుబాటులో ఉంచారు. ఒకవేళ ఎవరికైనా సందేహాలు ఉంటే ఫోన్‌ నంబర్లు 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9398810958, 6281704160లో సంప్రదించాలని సూచించారు. టెట్ దరఖాస్తుల ఫీజ్ చెల్లింపులు, దరఖాస్తుల సమర్పరణ నేటి (జూన్ 5) నుంచి జులై 5 వరకు ఉంటుంది. జులై 15 నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ ఉంటుంది. జులై 25 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌.. ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల, ఆగస్టు 25 నుంచి 31 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 8న తుది కీ విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న ఫలితాను విడుదల చేయనున్నారు.గతేడాది సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై ఐదేళ్లకుపైగా సర్వీస్‌ ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని చెప్పింది. అది కూడా రెండేళ్లలోపు తప్పనిసరిగా టెట్‌పాస్‌ కావాలని తీర్పు ఇచ్చింది. ఉద్యోగంల కొనసాగాలన్నా, ప్రమోషన్లకు సంబంధించి టెట్ పాస్ కావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ఉపాధ్యాయులు ఆందోళన చెందారాు. ఈ మేరకు అయితే ఈ తీర్పును మొత్తం 69 ఉపాధ్యాయ సంఘాలు సవాల్ చేశాయి.. రివ్యూ పిటిషన్లను దాఖలు చేశారు. మే 13న విచారణ జరిపిన కోర్టు పిటిషన్లను కొట్టేసింది. కాకపోతే టెట్‌పాస్ కావడానికి మూడేళ్లు గడువు పెంచింది. ఇన్‌సర్వీస్‌ టీచర్లు టెట్‌ పాస్‌ కావడానికి ఆగస్టు 31 వరకు గడువు పొడిగించింది. కనీసం ప్రతి రెండేళ్లకోసారి టెట్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొంది.