ఇప్పటి వరకు ఎండల దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి సిద్ధమైన రైతులకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. . కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కొమొరిన ప్రాంతం, లక్షద్వీప్, బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించినట్లు చెప్పారు. ముందు జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేశారు.. కానీ మూడు రోజులు ఆలస్యంగా గురువారం (జూన్ 4న) కేరళను తాకాయి. రుతుపవనాలు విస్తరించడానికి అనుకూలంగా ఉండటంతో మరో రెండు, మూడు రోజుల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలు, అరేబియా, బంగాళాఖాతానికి విస్తరిస్తాయని చెబుతున్నారు. ఈ ఏడాదిరుతుపవనాల సీజన్‌లో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గురువారం కేరళను తాకిన రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లో రెండు రోజుల్లో తాకుతాయని.. ఆ తర్వాత మెల్లిగా ఆంధ్రప్రదేశ్‌‌ మొత్తం తాకుతాయని.. ఈ నెల 15 నాటికి విస్తరిస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త జగన్నాథకుమార్‌ అంటున్నారు. నైరుతి రుతపవనాలు విస్తరించి వర్షాలు పడినా సరే.. ఉక్కపోత, వేడి పరిస్థితులు వెంటనే తగ్గవని భావిస్తున్నారు. అంతేకాదు దక్షిణ కోస్తాలో వేడిగాలుల ప్రభావం కొద్ది రోజులు కొనసాగుతుంది అంటున్నారు.మరోవైపు ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. 'ఇవాళ కాకినాడ, తూర్పుగోదావరి, పోలవరం,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు. ఇవాళ మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని కొన్నిచోట్ల 42-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో శనివారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని ఏపీ విపత్లుల శాఖ తెలిపింది. అలాగే కేరళం అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని.. రుతుపవనాలు దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను తాకాయని కూడా ఒక ప్రకటన చేసింది.