తీవ్ర ఎండలకు జలాశయాల నీటి మట్టం తగ్గటంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు ఒక శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలు , హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు హిమాయత్‌ సాగర్‌ డ్యామ్‌లోకి వరద ప్రవాహం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. అటు.. ఉస్మాన్ సాగర్‌ (గండిపేట జలాశయం)కు కూడా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారంహిమాయత్ సాగర్ జలాశయానికి 800 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు అధికారులు చెప్పారు. జలాశయాల నీటిమట్టాలు, ఇన్‌ ఫ్లోలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ జలమండలి అధికారులు.. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీటి ప్రవాహం పెరుగుతోందని తెలిపారు. మరోవైపు.. ఉస్మాన్ సాగర్‌కు కూడా వరద నీరు మెల్ల మెల్లగా 800 క్యూసెక్కులు వచ్చి చేరినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అలర్ట్‌గా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, విపత్తు నిర్వహణ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరంతోపాటు.. శివారు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా నగరానికి ప్రధాన తాగునీటి వనరులైన ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. క్యాచ్‌మెంట్ ఏరియాల నుంచి ఇన్‌ఫ్లో భారీగా వస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు.. మూసీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే నగరవాసులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.ఉస్మాన్‌సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1784.30 అడుగులకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,760.60 అడుగుల వద్ద నీరు కొనసాగుతోంది. ఈ సీజన్‌లో జంట జలాశయాలకు భారీగా వరద నీరు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.మరోవైపు.. పరిస్థితిని సమీక్షించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు హైడ్రా విభాగాలను అలర్ట్ చేశారు. వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంగా పనిచేసి.. ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితినైనా ఎదుర్కోనేందుకు రెడీగా ఉండాలని ఆదేశించారు. అయితే ఇప్పటివరకు జలాశయాల గేట్లు ఎత్తాల్సిన ప్రమాదకర స్థితి లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఒకవేళ ఎగువ నుంచి ఇన్ ఫ్లో మరింత పెరిగి గేట్లు ఎత్తాల్సి వస్తే.. ఆ సమాచారాన్ని ముందుగానే నగరవాసులకు చేరవేస్తామని వెల్లడించారు.