పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయినప్పటి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి దీదీకి ఎదురు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు అధికారం పోవడంతోపాటు.. ఇటు పార్టీ నేతలు షాకిస్తుండటంతో.. మమతా బెనర్జీకి ఊపిరి సలపడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. టీఎంసీ రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్‌.. దీదీకి లీగల్ నోటీసులు పంపించారు. దీదీతోపాటు పలువురు టీఎంసీ నేతలకు కూడా నోటీసులు పంపించారు. టీఎంసీ రెబల్‌ ఎంపీ కకోలీ ఘోష్‌ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్.. మమతా బెనర్జీకి తాజాగా లీగల్‌ నోటీసులు పంపించారు. దీదీతోపాటు ఆ పార్టీ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, మహువా మోయిత్రాలకు కూడా డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ నోటీసులు పంపారు. బరసత్ అసెంబ్లీ సీటులో పోటీ చేసేందుకు తాను టికెట్ కోరినట్లు టీఎంసీ నేతలు చేసిన ఆరోపణలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాను పంపించిన నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరికలు చేశారు.ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న .. బరసత్ ఎమ్మెల్యే టికెట్ కోసం తనను కొందరు సంప్రదించినట్లు చెప్పారు. అయితే పలువురు సీనియర్‌ నేతలు ఒప్పుకోకపోవడంతో వారికి ఆ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఎంపీ అయినంత మాత్రాన.. వారి కుటుంబంలోని అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలా అంటూ కకోలీ ఘోష్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కకోలి ఘోష్ టీఎంసీ పార్టీని వీడడం మాత్రమే కాకుండా తన కొడుక్కు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వనందుకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను బైద్యనాథ్ ఘోష్ తీవ్రంగా కొట్టిపారేశారు. తాను ఎప్పుడూ పదవి కోసం ఆశ పడలేదని స్పష్టం చేశారు. తన పరువుకు, తన కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు మమతా బెనర్జీతోపాటు ఇతర నేతలకు నోటీసులు పంపించినట్లు తెలిపారు. టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడటంతో పార్టీలో మమతా బెనర్జీ పలు కీలక మార్పులు చేసినట్లు తృణముల్ వర్గాలు వెల్లడించాయి. టీఎంసీ యూత్ ప్రెసిడెంట్‌గా నియమించిన వారం రోజులకే.. సయోని ఘోష్ ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో.. ఆ స్థానాన్ని దీదీ భర్తీ చేశారు. సయోని ఘోష్ స్థానంలో టీఎంసీ నేత అర్నబ్ బెనర్జీని యూత్ విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఎంసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కోల్‌కతా దక్షిణ ఎంపీ మాలా రాయ్ స్థానంలో.. కలిగంజ్ టీఎంసీ ఎమ్మెల్యే అలీఫా అహ్మద్‌ను మార్చినట్లు పేర్కొన్నాయి.