తెలంగాణలో పెన్షన్ దారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా భారీగా అనర్హులను గుర్తించారు. ఈ క్రమంలోనే ఏకంగా 1.28 లక్షల మందికి పెన్షన్లు కట్ చేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టిన అధికారులు.. అనర్హులను ఏరివేశారు. ఈ పెన్షన్ రద్దైన వారిలో చనిపోయిన వారు, ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు.. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న వారు.. ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉన్నారు. అయితే తొలగించిన 1.28 లక్షల పెన్షనల్లలో 1.02 లక్షల పెన్షన్లు గ్రామాల్లో నివసించే వారివే కావడం గమనార్హం. మిగిలిన 26 వేల పెన్షన్లు మున్సిపాల్టీల పరిధిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు.. పాత పెన్షన్లను రద్దు చేయడమే కాకుండా.. కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు కూడా అధికారులు కసరత్తులు చేపట్టారు. ఈ క్రమంలోనే కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 48 వేల మందిని ఎంపిక చేసి.. వారికి పెన్షన్లు అందించనున్నారు. ఇందులో వికలాంగులు, వితంతువులు ఉండగా.. వారి జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటే కొత్త లబ్ధిదారులకు పెన్షన్లను మంజూరు చేసేందుకు అధికారికంగా ఉత్తర్వులు వెలువరించనున్నారు.రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అదే సమయంలో అనర్హులకు వెంటనే పెన్షన్లు రద్దు చేయాలని భావించి.. సమగ్ర పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది. ఈ వెరిఫికేషన్‌లో భారీగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించి వాటిని కట్ చేశారు. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా భారం తగ్గనుంది. అదే సమయంలో కొత్తగా పెన్షన్ల కోసం అర్హులైన వారికి పింఛన్లు అందనున్నాయి. దీంతో అర్హులైన లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్నారు.