కొత్తగా ఉద్యోగాల్లోకి చేరిన వారికి కేంద్రం శుభవార్త.. జూన్ 19న వారి ఖాతాల్లోకి డబ్బులు

Wait 5 sec.

ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద జూన్ 19న రూ.2,400 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్రం వేయనుంది. తొలిసారి ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్‌ఓ ఉన్న వారికి నెల వేతనంగా రూ.15,000 వరకు, యజమాన్యానికి రూ.3,000 వరకు కింద అందజేస్తోంది. ఆగస్టు 1 2025 నుంచి జులై 31, 2027 మధ్య ఉద్యోగాల్లో చేరే వారికి ఇది వర్తిస్తుంది. ఉద్యోగికి ఏడాదికి 2 విడతల్లో.. యజమానికి రెండేళ్లలో ఈ మొత్తం అందనుంది. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను ప్రధాని మోదీ విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడం, ఉపాధిని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, అన్ని రంగాలలో సామాజిక భద్రతా పరిధిని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం అయిన పీఎం-వీబీఆర్‌వై అమలులో ఈ నిధుల విడుదల ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనకు తోడ్పడింది.పీఎంఓ ప్రకటన ప్రకారం.. కార్మికులు, యజమానులు ఇద్దరినీ అధికారిక ఆర్థిక వ్యవస్థలో పాల్గొనేలా ప్రోత్సహించడానికి పీఎం-వీబీఆర్‌వై రూపొందించారు. ఈ పథకం కింద తొలిసారిగా ఉద్యోగంలో చేరే వారికి రూ. 15,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఇది వారు ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే క్రమంలో కీలకమైన మద్దతును అందిస్తుంది. ఉపాధిని కల్పించే యజమాన్యానికి నెలకు రూ. 3,000 వరకు ప్రోత్సాహకంగా ఇస్తారు. ఇది నిరంతర ఉద్యోగ కల్పనను ఇది ప్రోత్సహిస్తుంది.ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడంలో ఉత్పాదక రంగానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తిస్తూ... ఈ రంగంలోని యజమానులకు నాలుగేళ్ల పాటు, మిగిలిన అన్ని ఇతర రంగాలలోని యజమానులు రెండేళ్ల పాటు ఈ ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హులని ఆ ప్రకటన పేర్కొంది. ఉపాధి ఆధారిత వృద్ధికి అనువైన వాతావరణాన్ని పెంపొందించడం, దేశ ఆర్థిక ప్రగతి ఫలాలు యువతకు నాణ్యమైన అధికారిక ఉద్యోగావకాశాలుగా మారేలా చూడటంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ పథకం ప్రతిబింబిస్తుంది.‘పీఎం-వీబీఆర్‌వై’పథకం 2025 ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చింది. మొత్తం రూ. 99,446 కోట్లు బడ్జెట్‌తో రెండేళ్ల కాలవ్యవధిలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ మొత్తం లబ్ధిదారులలో సుమారు 1.92 కోట్ల మంది మొదటిసారి ఉపాధి రంగంలోకి అడుగుపెడుతున్న యువత ఉంటారని అంచనా. ఉద్యోగులు, యజమానులు ఇద్దరికీ అండగా నిలవడం వల్ల ఉపాధిని విస్తరించడంలో, సామాజిక భద్రతా పరిధిని బలోపేతం చేయడంలో, వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పథకం ఒక ముఖ్య పాత్రను పోషిస్తోందని పీఎంఓ ప్రకటన పేర్కొంది.