తెలంగాణలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చాలా ఇళ్లు పూర్తిగా నిర్మాణం కాగా.. మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గుడిసెల్లో ఉండే వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకటించారు. అదే సమయంలో పైకప్పులు బలంగా లేని ఇళ్లకు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న గుడిసెలను గుర్తించేందుకు సమగ్ర సర్వే చేయాలని సంబంధిత అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ చేపట్టారు. కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సుమారు 75 వేల మంది గుడిసెల్లో ఉంటున్నట్లు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్న మంత్రి పొంగులేటి.. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అర్హులను గుర్తించాలని తెలిపారు. ఇక గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా ఎంపీడీవో ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికలో కులం, మతం, పార్టీ అనే తేడాలు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున.. రాష్ట్రంలో మొత్తం 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపిన పొంగులేటి.. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే పేద ప్రజల నివాస భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 500 చొప్పున.. మొత్తంగా 50 వేల ఇళ్లను ఈ రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇళ్లకు పునాదులు, గోడలు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులపై టార్పాలిన్ షీట్లు, రేకులు ఏర్పాటు చేసి.. ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను గుర్తించాలని.. ఆ ఇళ్లకు స్లాబ్ నిర్మించేందుకు వారికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. దీంతో పైకప్పు లేని వారు ఇందిరమ్మ ఇళ్లు రాకున్నా.. స్లాబ్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.