తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను మీట్ అవ్వడానికి సినీ ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆయన్ను కలిసి అభినందించారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత చెన్నైలో విజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన విజయ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను సామ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. గతంలో విజయ్ తో కలిసి ‘కత్తి’, ‘అదిరింది’, ‘పోలీసోడు’ వంటి మూడు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన సమంత.. దళపతి సినీ, రాజకీయ ప్రయాణాలపై ప్రశంసలు కురిపించారు. విజయ్ కేవలం తెరపై హీరోగా మిగిలిపోరని తనకు ఎప్పుడో అనిపించిందని, ఆయన ఏదో గొప్ప పని కోసమే పుట్టారన్న భావన కలిగిందని సామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ''ఈరోజు నేను చెన్నైలో అడుగుపెట్టగానే, నాకు ఎంతో ఆనందం కలిగింది. ఎందుకంటే నేను మన ముఖ్యమంత్రిని కలవబోతున్నాను. విజయ్ సార్ కేవలం తెరపై హీరోగా మాత్రమే మిగిలిపోరని నాకు ఎప్పుడూ అనిపించేది. ఆయన ఎనర్జీ, ఆయన ఉనికి, ప్రజలు ఆయనకు స్పందించే తీరు చూసి.. ఆయన ఏదో గొప్ప పని కోసం పుట్టారన్న భావన నాకు కలిగింది. పూర్తిగా కొత్త రంగంలోకి అడుగుపెట్టడానికి కావలసిన ధైర్యం నన్ను ఎంతగానో ప్రేరేపించింది'' ''ఆల్రెడీ అత్యున్నత శిఖరాలను అధిరోహించిన రంగాన్ని వదిలిపెట్టి, పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండే సవాలును స్వీకరించడం ఏమంత సులభం కాదు. మీరు ఒక మార్పు తీసుకురాగలరని నమ్మినప్పుడే అది సాధ్యమవుతుంది. మన జీవితంలో ఏదో ఒక సమయంలో, మనమందరం ఇంకా ఎక్కువ చేయాలని పిలుపు అందుకుంటామని నేను అనుకుంటున్నాను. మనల్ని మనం దాటి చూసి, ఎలా మనం కంట్రిబ్యూట్ చేయగలమో ప్రశ్నించుకోవాలి. చాలా తక్కువ మంది మాత్రమే ఆ పిలుపుకు స్పందిస్తారు''''ఇప్పటికే విజయ్ సార్‌ను నమ్మిన వారిని కూడా ఆయన ఆశ్చర్యపరుస్తారని నాకు అనిపిస్తోంది. ఆయన పదవిలో ఉన్నందువల్ల కాదు, ఆయన ఆ పదవిని చేపట్టే సంకల్పం వల్ల. ఆయనకు బలం, వివేకం, ఈ మార్గంలో నిలకడగా ఉండే ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. ఇది చూస్తున్న ప్రతి యువతకు.. మీరు మొదలుపెట్టిన కల కన్నా జీవితం ఎంతో విశాలంగా ఉంటుందనే విషయాన్ని ఇది గుర్తుచేయాలి'' అని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మించారు.