‘ప్రజలను కుక్కలతో పోల్చానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’.. రాఘవ లారెన్స్ క్లారిటీ

Wait 5 sec.

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు ఇటీవల కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే తాను రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని పేర్కొన్నారు. అప్పటి నుంచి తమిళనాట లారెన్స్‌ హాట్ టాపిక్ గా నడుస్తున్నారు. ఈ క్రమంలో లారెన్స్ ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ మేరకు ఓ వీడియో వైరల్ అయింది. దీనిపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. ప్రజలను కుక్కలతో పోల్చానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తానెప్పుడూ ప్రజలు తన తల్లితో సమానమని చెబుతుంటానని ఆయన స్పష్టం చేశారు. ''అందరికీ నమస్కారం, నా ఇటీవలి ప్రెస్ మీటింగ్ కి సంబంధించి తలెత్తిన ఒక అపోహను నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నా అభిమానులు, ప్రజలు నాకు అమ్మతో సమానమని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. అయితే, నేను ప్రజలను కుక్కలతో పోల్చానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు''''మనం కొత్త ఇంటికి మారినప్పుడు, అక్కడి పరిసరాలను, అలాగే ఆ ప్రాంతంలోని కుక్కల అలవాట్లను, అవి ఏమి తినడానికి ఇష్టపడతాయో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని నేను చెప్పదలచుకున్నాను. నేను ఎంతో గౌరవించే, అమ్మతో సమానంగా భావించే ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కాను. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుందనే విషయం గురించి మాత్రమే నేను మాట్లాడాను తప్ప, ఎక్కడా ప్రజలను ఉద్దేశించి అలా అనలేదు. దయచేసి అందరూ ఆ పూర్తి వీడియోను చూసి, నేను నిజంగా ఏమి చెప్పానో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మీ మద్దతుకు ధన్యవాదాలు'' అని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. తాను మాట్లాడిన వీడియోని షేర్ చేసుకున్నారు. లారెన్స్‌ రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు సీఎం విజయ్ తిరుచ్చి ఈస్ట్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన తర్వాత, ఉప ఎన్నికలో అక్కడి నుంచి లారెన్స్‌ పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. డబ్బు సంపాదించాలని, సీటు ఆశించాలనే ఉద్దేశం తనకు లేదని.. రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు చేస్తున్న దానికన్నా పెద్ద స్థాయిలో సమాజసేవ చేయాలన్నదే తన ఏకైక ఆలోచన అని తెలిపారు. అయితే తన ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో ప్రారంభించాలని అనుకుంటున్నానో త్వరలో వెల్లడిస్తానన్నారు. తన నిర్ణయంపై ప్రజలు, అభిమానులు సలహాలు చెప్పాలనికోరుతూ.. వాళ్లు ఆమోదిస్తేనే రాజకీయాల్లోకి వస్తానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని లారెన్స్ చెప్పారు.