తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్.. జూలై 29 వరకు దరఖాస్తులు

Wait 5 sec.

ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ).. కీలక చర్యలు చేపట్టింది. ఇక నుంచి వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని ఇటీవలె ఛైర్మన్ బుర్రా వెంకటేశం కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఒకదాని తర్వాత ఒకటి నోటిఫికేషన్లను జారీ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కొన్ని నోటిఫికేషన్లను విడుదల చేసిన టీజీపీఎస్సీ.. తాజాగా తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న డైట్‌ కళాశాలల్లో ఖాళీల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ కాలేజీల్లో సీనియర్‌ లెక్చరర్స్‌, లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. 86 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసిన టీజీపీఎస్సీ.. అందులో సీనియర్ లెక్చరర్ పోస్టులు 23.. మిగిలిన 63 లెక్చరర్ పోస్టులు పలు సబ్జెక్టుల వారీగా ఉన్నాయని ప్రకటించింది. ఈ పోస్టులకు అర్హులుగా ఉన్న అభ్యర్థులు.. ఈనెల 24వ తేదీ నుంచి జులై 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఓటీఆర్ (వన్ టైమ్ రిజిస్ట్రేషన్) అప్‌డేట్ ఉండాలని తేల్చి చెప్పింది. ఇక ఈ ఏడాది నవంబర్‌లో ఈ సీనియర్ లెక్చరర్స్, లెక్చరర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షను నిర్వహించే అవకాశం ఉన్నట్లు టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ పోస్టుల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు కనీస వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయో పరిమితిని 44 ఏళ్లుగా టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఈ వయసును 2026 జులై 1వ తేదీ నాటికి లెక్కించనున్నట్లు తెలిపింది. అదే సమయంలో రూల్స్ ప్రకారం.. పలు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ఠ వయో పరిమితిలో సడలింపు ఉంటుందని స్పష్టం చేసింది. లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి జోన్‌ల వారీగా పోస్టుల ఖాళీలతోపాటు.. వయో పరిమితి.. వేతనం.. పరీక్ష సిలబస్‌ వంటి పూర్తి వివరాలు.. నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం సహా అన్ని విషయాలు తెలుసుకునేందుకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో చూడొచ్చని తెలిపింది. ఏదైనా ఇబ్బందులు, సహాయం కోసం వెబ్‌సైట్‌లో ఉన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి.. సందేహాలు నివృత్తి చేసుకోవాలని హితవు పలికింది.