భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ దేశంలోని తీర ప్రాంతమైన నైస్‌లో సమావేశమై సెల్ఫీ దిగి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పదాల ప్రాస కలిసేలా మోదీ చేసిన పోస్ట్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. "నైస్‌లో మిమ్మల్ని కలవడం నైస్‌గా అనిపించింది. ఈ పర్యటన తొలి దశ ఎంతో ఫలప్రదంగా సాగింది. భారత్ - ఫ్రాన్స్ భాగస్వామ్యం ఇరు దేశాల అభ్యున్నతికి దోహదపడుతుంది. ఎవియన్, పారిస్‌లో మళ్లీ కలుద్దాం" అంటూ మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఇదే సెల్ఫీని అంతకు ముందు మాక్రోన్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో కేవలం నైస్ అనే ఒక్క పదం మాత్రమే క్యాప్షన్ ఇవ్వగా.. మోదీ ప్రాస జోడించి పోస్ట్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. మాక్రోన్ - మోదీ భేటీతో భారత్ - ఫ్రాన్స్ వాణిజ్యానికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయి. ఇరు నేతల మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్, ఫ్రాన్స్ దేశాల రానున్న ఐదేళ్లలో తమ వాణిజ్యాన్ని డబుల్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఉన్న 16 బిలియన్ డాలర్ల నుంచి వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దాంతో పాటు కొత్త ఆవిష్కరణల రోడ్ మ్యాప్, ఏఐపై ఉమ్మడి ఫ్రేమ్ వర్క్స్‌ను కూడా ఇరు దేశాలు ప్రకటించాయి. ఓవరాల్‌గా మోదీ - మాక్రోన్ చర్చల్లో మొత్తం 13 కీలక ఫలితాలు వెలువడ్డాయి. హైస్పీడ్ రైల్వే సహకారం, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం.. పారిస్, నైస్ విమానాశ్రయాల్లో భారత యూపీఐ చెల్లింపులను విస్తరించడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపిన వివరాల ప్రకారం.. పౌర అణుశక్తి, రక్షణ, భద్రత, అంతరిక్షం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. వీటిపై పాటు ప్రముఖంగా భారత్ 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.