కేఫ్ నీలోఫర్ సిబ్బంది నెల జీతం అన్ని లక్షలా..? ఐటీ ఉద్యోగుల ప్యాకేజీలు కూడా జుజుబీ..!

Wait 5 sec.

హైదరాబాద్ ఇరానీ చాయ్‌కి ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ కేఫ్ నీలోఫర్ పేరు వింటే టీ లవర్స్ హృదయాలు పులకరిస్తాయి. నగరవాసులకే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి కూడా ఇదొక ఐకానిక్ బ్రాండ్. నిత్యం వేలాది మంది కస్టమర్లతో కిటకిటలాడే ఈ కేఫ్.. ఇటీవల బంజారాహిల్స్ బ్రాంచ్ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది. ఈ వివాదాలను పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో నీలోఫర్ కేఫ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో రీల్ విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో కేఫ్ ఉద్యోగుల జీతాల గురించి వెల్లడైన విషయాలు చూసి ఐటీ కారిడార్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సీఈవోలు సహా సామాన్య నెటిజన్లు సైతం నోరెళ్లబెడుతున్నారు.కేఫ్ నీలోఫర్ అధినేత బాబూరావు తనయుడు, కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుమల శశాంక్ ఇటీవల ఓ బిజినెస్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమ కేఫ్ సాధించిన అపూర్వ విజయం వెనుక ఉన్న రహస్యాలను, దశాబ్దాలుగా కస్టమర్లను ఎలా ఆకట్టుకుంటున్నారనే విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా తమ దగ్గర పనిచేసే చాయ్, బిస్కట్ తయారీ మాస్టర్లు, ఇతర సిబ్బంది జీతాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కార్పొరేట్ కంపెనీల సీఈవోల స్థాయిలో ఉన్న ఈ జీతాలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి. 'సాధారణంగా ఒక కేఫ్ లేదా హోటల్ తమ సిబ్బందికి ఎంత జీతం ఇవ్వగలుగుతుంది ? మహా అయితే నెలకు రూ. 50 వేలు ఇస్తుంది. కానీ.. మా కేఫ్ నీలోఫర్‌లో సంవత్సరానికి రూ. 60 లక్షల ప్యాకేజీ తీసుకునే వారు కూడా ఉన్నారు. అంటే నెలకు రూ. 5 లక్షల వరకు శాలరీ ఇస్తున్నాం. కస్టమర్ ఈజ్ గాడ్.. ఎంప్లాయి ఈజ్ అవర్ ఫ్యామిలీ అని ఎప్పుడూ చెబుతుంటారు. మేము మాటకు కట్టుబడి ఉన్నాం.. ఇక మీదట కూడా అలాగే ఉంటాం' అని శశాంక్ వెల్లడించారు. సాధారణంగా హోటల్ లేదా కేఫ్ వంటి వాటిల్లో ఒక నైపుణ్యం కలిగిన కార్మికుడికి నెలకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతం ఉంటుందని ఎవరూ ఊహించరు. పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల్లో రాత్రింబవళ్లు పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు, కంపెనీల సీఈవోలకు ఇచ్చే ప్యాకేజీల కంటే ఇది చాలా ఎక్కువ. నీలోఫర్ కేఫ్ అంత మొత్తాన్ని సిబ్బందికి ఇవ్వడానికి బలమైన కారణాలు ఉన్నాయని శశాంక్ వెల్లడించారు. దశాబ్దాలుగా క్వాలిటీ, టేస్ట్ మారకుండా ఉండటమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. వేలాది మంది కస్టమర్ల ఒత్తిడిని తట్టుకుంటూ పనిచేసే వారి శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తున్నామన్నారు. ఒకసారి ఇక్కడ టేస్ట్ అలవాటైన కస్టమర్ వేరే ఎక్కడికీ వెళ్లరు కాబట్టి.. ఆ టేస్ట్ మారకుండా ఉండేందుకు మాస్టర్లు కేఫ్ వదిలి వెళ్లకుండా వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటామన్నారు.ఈ వీడియో క్లిప్ రీల్స్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వేదికలపై విపరీతంగా షేర్ అవుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం ఈ జీతాలు చూసి షాక్ అవుతున్నారు. 'మేం రాత్రింబవళ్లు కళ్లు కాయలు కాచేలా లాప్‌టాప్‌ల ముందు కూర్చున్నా రాని జీతం... అక్కడ చాయ్, బేకింగ్ మాస్టర్లకు వస్తోందా? రేపటి నుంచి చాయ్ పెట్టడం నేర్చుకోవాలి' అంటూ కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే అది టీ మాస్టర్ల శాలరీ కాదని.. అక్కడ పనిచేసే సీఈవో జీతం అయి ఉండొచ్చునని మరికొందరు అంటున్నారు. 'ఉద్యోగులను కేవలం జీతగాళ్లుగా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకునే ఇలాంటి ఓనర్స్ ఉండటం వల్లే ఆ బ్రాండ్‌కు అంత వాల్యూ' అంటూ ఇంకొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.