ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ఎయిర్‌‌పోర్ట్‌లపై దృష్టిసారించింది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొత్త విమానాశ్రాయాలకు సంబంధించి ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపించింది. తాజాగా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయనున్న మరో ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి కీలక ముందడుగు పడింది. భోగాపురానికి దాదాపు 154 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో విమానాశ్రయం ప్రతిపాదించగా.. తాజాగా ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ రూపొందించారు. మొత్తం 1,185.56 ఎకరాల్లో నిర్మాణానికి ప్లాన్ చేశారు. మొదటి దశలో భాగంగా రూ.750.52 కోట్లతో పనులు చేపట్టి 2030నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. పలాస విమానాశ్రయంలో 2,400 మీటర్ల రన్‌వే ప్లాన్ చేశారు. అలాగే రన్‌వే స్ట్రిప్ 140 మీటర్ల వెడల్పుతో, టాక్సీ వే, బ్లాస్ట్‌ ప్యాడ్‌లు 23 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఇలా మొత్తం 44 అంశాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కమర్షియల్ ఏరియాను 337 ఎకరాల్లో డెవలప్ చేసేలా.. ఇక్కడ పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్, రిటైల్ షాపులు, హోటల్స్, హెల్త్‌కేర్, ఐటీ, నాన్ ఐటీ వంటి సంస్థలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కమర్షియల్ ఏరియాకు కేటాయించిన మట్టి నమానా పరీక్షలు కూడా చేశారు. ఈ మేరకు మాస్టర్‌ప్లాన్‌ను రైట్స్‌ సంస్థ రూపొందించింది. పలాస విమానాశ్రయానికి సంబంధించి మూడు ప్రతిపాదనల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఏఐ (ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)/ప్రైవేట్‌ భాగస్వామ్యం ఒక ఆప్షన్ కాగా.. ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్‌ వెంచర్‌ సంస్థగామరో ప్రతిపాదన ఉంది. ఏఏఐ ద్వారా అభివృద్ధి చేయాలని మూడో ఆప్షన్ ప్రతిపాదించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను మూడు దశల్లో విస్తరించాలని ప్రతిపాదించారు. ఈ పలాస విమానాశ్రయం నుంచి సోంపేట(32 కి.మీ.), ఇచ్ఛాపురం(50 కి.మీ.), పాలకొండ(93 కి.మీ.)గా ఉంది.. ఈ ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. పలాస విమానాశ్రయం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు 154 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీకాకుళం జిల్లావాసులు భోగాపురం వెళ్లకుండా పలాస వెళితే సరిపోతుంది. ఉత్తరాంధ్ర, అటు ఒడిశా నుంచి జీడిపప్పు, వ్యవసాయ పంటలు, సీ‌ఫుడ్‌ను ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. శ్రీకాకుళంవాసులు ప్రస్తుతం విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి విమానంలో వెళుతున్నారు. త్వరలో ప్రారంభమయ్యే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళతారు. అక్కడికి వెళ్లాలన్నా 2 గంటలకుపైగా ప్రయాణించాలి.. అదే ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ వస్తే ప్రయాణం మరింత సులభంగా ఉంటుంది. శ్రీకాకుళం నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 1,200 కిలోమీటర్లు.. అదే హైదరాబాద్ అయితే 800 కిలోమీటర్లు. ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం రైళ్లు, రోడ్డు మార్గాల్లో వెళ్లేవారిలో కొందరైనా విమానాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద పలాస విమానాశ్రయం దిశగా అడుగులు పడుతున్నాయి.