ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన మ్యాచులో భారీ తేడాతో పరాజయాన్ని చవిచూడటంతో పాకిస్థాన్ కెప్టెన్ తీవ్ర అసంతృప్తి, నిరాశ వ్యక్తం చేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆమె.. తమ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచిందని పేర్కొంది. ప్రపంచకప్‌లో తమకు ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉందని.. రాబోయే మ్యాచుల్లో బ్యాటర్లు ఖచ్చితంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫాతిమా సనా స్పష్టం చేసింది."భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొలి 15 ఓవర్ల వరకు మా బౌలింగ్, ఫీల్డింగ్ అనుకున్నట్లుగానే సాగాయి. కానీ చివరి ఓవర్లలో మేము చాలా అదనపు పరుగులు ఇచ్చేశాం. ఒక దశలో స్లో ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా ఒక ఫీల్డర్‌ను లోపలికి తీసుకువచ్చాం. అది కూడా మాకు భారీ నష్టాన్ని చేకూర్చింది. రాబోయే మ్యాచ్‌లలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. స్లో ఓవర్ రేట్ పెనాల్టీ పడటానికి భారత బ్యాటర్ల లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కూడా ఒక కారణం కావచ్చు. మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు.. ఈ అనుభవాల నుంచి వారు త్వరగా పాఠాలు నేర్చుకుని భవిష్యత్‌లో రాణిస్తారు" అని ఫాతిమా సనా పేర్కొంది.ఫీల్డర్లపై అసహనం.."క్యాచ్‌లు విడిచిపెడితే మ్యాచ్‌లు గెలవడం అసాధ్యం. దురదృష్టవశాత్తూ భారత్‌తో మ్యాచ్‌లో మేము ముఖ్యమైన క్యాచ్‌లను వదిలేశాం. అందులోనూ సీనియర్ ప్లేయర్లే ఇలాంటి తప్పులు చేయడం విచారకరం. ఫీల్డింగ్‌లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు మొత్తం మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తాయి. వచ్చే మ్యాచ్‌లో మేం మా ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకుంటాం" అని సనా వెల్లడించింది.భారత్ చేతిలో ఓటమితో పాకిస్థాన్ గ్రూప్ ఏ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానానికి పడిపోయింది. ఆ జట్టు తన తర్వాతి మ్యాచులో జూన్ 17న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.