తెలంగాణలో కిడ్నీల వైఫల్యం కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రతి లక్ష మంది జనాభాను పరిగణనలోకి తీసుకుంటే.. అందులో 10,601 మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో సగటున 19 మంది మృత్యువాత పడుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితులపై భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ప్రచురించే ప్రతిష్టాత్మక ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ డికల్‌ రీసెర్చ్‌లో ఒక సమగ్ర పరిశోధనాత్మక వ్యాసం ప్రచురితమైంది. ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌ వైద్య నిపుణులు గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ గణాంకాల ఆధారంగా.. 1990 నుంచి 2023 వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న కిడ్నీ వ్యాధుల సరళిని లోతుగా విశ్లేషించారు. ఈ అధ్యయనంలో దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే కిడ్నీ వ్యాధుల మరణాల రేటు, వ్యాధి కారణంగా కోల్పోతున్న ఆరోగ్యకరమైన జీవితకాలం అత్యధికంగా ఉన్నట్లు తేలింది.రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులు ఇంతగా ముదరడానికి ప్రధాన కారణాల్లో మధుమేహం కీలకమైనదిగా పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా దేశవ్యాప్తంగా నమోదయ్యే కిడ్నీ కేసుల్లో షుగర్ వ్యాధి పాత్ర 18 నుంచి 24 శాతం వరకు ఉంటే.. తెలంగాణలో మాత్రం ఇది అత్యధిక శాతంగా నమోదైంది. ఇక్కడి ప్రజల్లో మధుమేహ వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం, గుర్తించినా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోకపోవటం వల్లే రోగుల కిడ్నీలు చాలా వేగంగా పాడవుతున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలోనే అతి తక్కువగా రాజస్థాన్‌లో ప్రతి లక్ష మంది జనాభాకు కిడ్నీ వ్యాధుల వల్ల 6.71 మరణాలు సంభవిస్తుంటే.. తెలంగాణలో అది గరిష్టంగా 19.84గా ఉంది. ఇది జాతీయ సగటు కంటే చాలా రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.ఈ అధ్యయనం ప్రకారం.. తెలంగాణలో కిడ్నీ వ్యాధుల మరణాలు ఎక్కువగా పేద, దిగువ మధ్యతరగతి వర్గాల్లోనే సంభవిస్తున్నాయి. వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు లేకపోవడం, సరైన అవగాహన లోపించడం వల్ల రోగులు చివరి దశలో ఆసుపత్రులకు వస్తున్నారు. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించడానికి పరిశోధకులు ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ వ్యాధుల నివారణను ఒక ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. మధుమేహం, రక్తపోటు ఉన్న రోగులందరికీ గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా క్రియాటినిన్, మూత్ర పరీక్షలు క్రమంతప్పకుండా నిర్వహించాలని సూచించారు. అలాగే, పేద రోగులకు ఉచితంగా డయాలసిస్, కిడ్నీ మార్పిడి సేవలు మరింత సులభంగా అందేలా వైద్య మౌలిక వసతులను వేగంగా మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.