టాటాల గొప్ప మనసు.. ఏకంగా రూ. 2 వేల కోట్లు విరాళం.. ఏపీలో సామాన్యులకు క్యాన్సర్ చికిత్సలు!

Wait 5 sec.

: దేశంలోనే అత్యంత విలువైన, విశ్వసనీయ సంస్థల్లో టాటా గ్రూప్ ముందు వరుసలో ఉంటుంది. అయితే టాటా గ్రూప్, హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణించిన తర్వాత గతితప్పిందన్న వార్తలు వచ్చాయి. ముఖ్యంగా గ్రూప్‌కు చెందిన పలు సంస్థల్లో లాభాదాయాలు తగ్గడం, షేర్ల విలువలు భారీగా పడిపోవడంతో మార్కెట్ విలువ పతనం కావడం జరిగాయి. తర్వాత ఇటీవల మాత్రం కొంత కాలంగా టాాటా ట్రస్టులో విభేదాలు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అంతర్గత విభేదాల నేపథ్యంలో టాటా సన్స్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా ట్రస్టీల మధ్య అభిప్రాయ భేదాలు కూడా బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా వీటి గురించి స్పందించారు టాటా ట్రస్ట్స్ సీఈఓ సిద్ధార్థ్ శర్మ.'మా గురించి అంతా వివాదాలు, గందరగోళం గురించే మాట్లాడుతున్నారు. కానీ అసలు మా టాటా ట్రస్ట్స్ పనేంటనేది మర్చిపోతున్నారు. మా లక్ష్యం దాతృత్వం, సమాజ సేవ.' అని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. వాస్తవాల్ని పూర్తిగా పరిశీలించకుండానే చాలా కథనాలు ప్రచారం అవుతున్నాయని.. టాటా ట్రస్ట్స్ మాత్రం ఎప్పటిలానే సమాజంలో అట్టడుగు వర్గాల వారి కోసం సేవ చేస్తూనే ఉంటుందన్నారు. ఎలాంటి ప్రచారం, హడావుడి/ఆర్బాటం లేకుండా కఠోర శ్రమతో పని చేయడమే తమ పద్ధతి అని, దీనికి బయటినుంచి వచ్చే విమర్శలతో పనిలేదని అన్నారు. దాతృత్వ వ్యయం పెంపు..ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికిగానూ టాటా ట్రస్ట్స్ దాతృత్వ వ్యయాల్ని దాదాపు రూ. 2 వేల కోట్లకు పెంచుతున్నట్లు సిద్ధార్థ్ శర్మ పేర్కొన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం రూ. 1600 కోట్లుగా ఉండగా ఇప్పుడు 25 శాతం ఎక్కువ వెచ్చిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. టాటా ట్రస్ట్స్‌కు టాటా సన్స్ నుంచి వచ్చే డివిడెండ్లే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. ఈ డివిడెండ్ మొత్తాన్ని తిరిగి సమాజ సేవా కార్యక్రమాల కోసమే విరాళాలుగా కేటాయిస్తుండటం విశేషం. టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా టాటా ట్రస్ట్స్ చేతుల్లోనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులతో ఆంధ్రప్రదేశ్ సహా అసోం, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో నాణ్యమైన, అందుబాటు ధరల్లో సామాన్యులకు క్యాన్సర్ వైద్య సేవల్ని మరింత విస్తరించనున్నట్లు సిద్ధార్థ్ తెలిపారు. ఇదివరకే టాటా మెమోరియల్ వంటి సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో టాటా ట్రస్ట్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే సమయంలో దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్య కోసం ప్రపంచ స్థాయి యూనివర్సిటీని నెలకొల్పేందుకు.. ప్రముఖ విద్యా సంస్థతో చర్చలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.