ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కో అకౌంట్‌లో రూ.7వేలు జమ, పూర్తి వివరాలివే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం 2026-27కు సంబంధించి మొదటి విడత నిధులు విడుదల చేయనుంది. ఈ నెల 20వ తేదీన (శనివారం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయి. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌లోని తారకేశ్వర్‌లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులను అదే రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో విడుదల చేయనున్నారు. రైతుల అకౌంట్‌లలో వెంటనే రూ.7వేలు చొప్పున డబ్బులు జమకానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ పథకం కింద 2026-27కు సంబంధించి మొదటి విడతగా ఒక్కో రైతుకి రూ.7వేలు చొప్పున డబ్బులు జమ చేస్తారు. ఈ రూ.7 వేలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు ఉన్నాయి. రాష్ట్రంలో 46లక్షల85వేల838 మంది రైతుల బ్యాంక్ అకౌంట్‌లలో మొత్తం రూ.3,125.47కోట్లు జమ కానున్నాయి. వీరిలో పట్టాదారు రైతు కుటుంబాలు 45లక్షల69వేల817మంది ఉంటే.. అటవీ భూసాగు హక్కుదారులు 1,16,021 మంది ఉన్నారు. రైతులకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్ర వాటా కింద రూ.2,342.92కోట్లు, కేంద్ర వాటా కింద రూ.782.5కోట్లు ఉన్నాయి. ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పల్నాడు జిల్లాలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం నుంచి రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ యోజన పథకం కలిపి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా రూ.14 వేలు అందిస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం రూ.6వేలు ఇస్తోంది.. ఈ రెండు కలిపి రూ.20వేలు ప్రతి రైతుకు అందిస్తున్నారు. మొత్తం మూడు విడతల్లో రూ.7వేలు, రూ.7వేలు, రూ.6వేల చొప్పున రైతులకు జమ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నా రైతుల సంక్షేమంలో మా కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడదన్నారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆక్వా, పొగాకు, తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించి రైతులకు మేలు చేసే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి సరుకుల ధరల పెరుగుదల వల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాలని చూసినా, రైతులపై భారం పడకూడదన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని ఫీడ్ ధరను కేజీకి ఇప్పుడున్న ఎంఆర్‌పీ రూ.112 నుంచి రూ.108కి తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అలాగే ఆక్వా ఫీడ్ ధర స్థిరీకరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశాం, ఈ కమిటీ 20 రోజుల్లోగా నివేదిక సమర్పించిన అనంతరం ధరపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్ల వర్జీనియా పొగాకు ధరలు ప్రభావితమైనప్పటికీ రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు అచ్చెన్నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో అన్ని కొనుగోలు సంస్థలు తప్పనిసరిగా పాల్గొనాలని, మార్కెట్‌లో పొగాకు రకం ఏదైనా కిలో రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. వేలం కేంద్రాల వెలుపల జరిగే అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు ఉంటాయని.. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు భవిష్యత్తులో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సాగు విస్తీర్ణంపై రైతులకు ముందస్తు మార్గదర్శకాలు అందిస్తామన్నారు. తోతాపూరి మామిడి ధరలు పడిపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలుస్తూ, గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. పల్ప్ పరిశ్రమల్లో నమోదు చేసుకుని మామిడిని విక్రయించిన రైతుల ఖాతాల్లో నేరుగా ఈ ప్రోత్సాహక మొత్తం జమ అవుతుందన్నారు.