అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందంతో ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. ముఖ్యంగా ఆ శాంతి ఒప్పందంలో లెబనాన్‌పై దాడులు నిలిపివేయాలనే కండీషన్ కూడా ఉండటంతో ఇజ్రాయెల్ నేతలు పెదవి విరుస్తున్నారు. దాంతో ఇరు దేశాల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ కాస్త పక్కదారి పట్టే పరిస్థితులు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ నాయకులపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కీలక ఒప్పందం తర్వాత వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన జేడీ వాన్స్ జాతీయ భద్రతా సమస్యలు అన్నింటికీ చంపదం ఒక్కటే పరిష్కారం కాదని.. చంపడంతోనే పరిష్కరించలేమంటూ ఇజ్రాయెల్‌కు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్న ఏకైక ప్రపంచ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అనే విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ తాను ఇజ్రాయెల్ కేబినెట్‌లో ఉండుంటే తనకు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రుడిపై దాడి చేయనంటూ కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్‌కు ప్రధాన సమస్య ట్రంప్ కాదని, అమెరికా అధ్యక్షుడే తమ సమస్య అనుకునే వారు వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాలి అని వాన్స్ చెప్పారు.ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న రక్షణ ఆయుధాల్లో రెండు, మూడో వంతు అమెరికా తయారు చేసినవే అని గుర్తుంచుకోవాలన్నారు. అదేవిధంగా ఆ ఆయుధాలన్నీ అమెరికాలో ట్యాక్స్ చెల్లించే వారి నిధులతోనే సమకూర్చామని చెప్పారు. అమెరికా - ఇరాన్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామార్ బెన్ గ్విర్, ఆర్థిక బెజలెల్ స్మోట్రిచ్ బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో జేడా వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. 90 లక్షల జనాభా ఉన్న దేశం ఇజ్రాయెల్‌కు ఎదురయ్యే ప్రతి భద్రతా సమస్యను కేవలం చంపడం ద్వారా పరిష్కరించలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి వ్యవస్థలపై నియంత్రణ విధించలేదనేది ఇజ్రాయెల్ ఆందోళనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దాంతో పాటు లెబనాన్‌లోని హెజ్బొల్లాపై తమ సైనిక చర్యలను ఈ ఒప్పందం ఆంక్షలు విధిస్తోందని ఇజ్రాయెల్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో వ్యాన్స్ మీడియా సమావేశం అనంతరం ట్రంప్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. లెబనాన్, హెజ్బొల్లా, ఇజ్రాయెల్ సహా అన్ని ప్రాంతాల్లో పూర్తి కాల్పుల విరమణ జరగాలని మేము ఆశిస్తున్నామంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ వ్యవహార శైలిపై బెన్ గ్విర్ అమెరికా నాజీలంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి అని చెప్పేందుకు ఉదాహరణగా మారింది. అమెరికా కాల్పుల విరమణ చేయాలని చెప్పిన తర్వాత కూడా దక్షిణ లెబనాన్‌లో సైనిక ఉనిక కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.