ఏపీలో ఆ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం డబ్బులు ఇవ్వండి.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసేందుకు సిద్ధమైంది. జులై మూడో వారంలో తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమ చేసేందుకు కసరత్తు జరుగుతోందని అధికారులు విద్యాశాఖ మంత్రికి తెలిపారు. ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్‌ పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేష్ తల్లికి వందన పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనాథ పిల్లలకు కూడా తల్లికి వందన పథకం డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనాథ పిల్లల సంరక్షకుల వివరాలు సేకరించాలని, ఒకవేళ ఎవరూలేకపోతే కలెక్టర్‌కు పంపి, అక్కడి నుంచి పిల్లలకు డబ్బులు చేరేలా చూడాలని సూచించారు. అనాథ పిల్లల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసే విధానంపై కూడా ఆలోచించాలన్నారు. ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు ఇస్తోంది.. వీటిలో రూ.13వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తుండగా.. మిగిలిన రూ.2వేలు పాఠశాలల నిర్వహణ కోసం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులకు సంబంధించి మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేటు బడులలో నిర్ణయించిన ఫీజులను బోర్డులపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫీజుల వివరాలు పబ్లిక్‌ డొమైన్‌లో కూడా అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థి మిత్ర కిట్లను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న 2.03 లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల విషయంలో అనవసరమైన నిబంధనలు తొలగించాలని అధికారుల్ని మంత్రి లోకేష్ ఆదేశించారు. తెలుగు అకాడమీ ముద్రించే పాఠ్యపుస్తకాలు ఈ కామర్స్ వేదికల ద్వారా విక్రయించాలన్నారు. బ్రిడ్జ్ కోర్సు మెటీరియల్ సిద్ధం చేసి విద్యార్థులకు అందించాలని.. స్కూళ్లలో వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు. హైస్కూల్ విద్యార్థులకు క్రోమ్ బుక్స్‌తో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అల్లూరి సీతారామరాజు, పోలవరం, మార్కాపురం, కర్నూలు, అనంతపురం జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. గణితం, సైన్స్‌, తెలుగు సబ్జెక్టుల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలవుతున్నారని మంత్రికి అధికారులు వివరించారు. అంతేకాదు రాష్ట్రంలో విద్యార్థుల హాజరు 95 శాతం తగ్గకుండా చూడాలని.. తెలుగును విస్మరించొద్దని మంత్రి అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి. కడప మోడల్2లో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 430 కేజీబీవీల్లో విద్యనభ్యసిస్తున్న 1,06,360 మంది విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.