ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. క్లారిటీ ఇచ్చిన ఏజీ, ఆ నెలలో ఫిక్స్?

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌‌లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేశారని.. ఆ వివరాలను గ్రామసభల ముందుకు తీసుకెళతారని ఏజీ కోర్టుకు తెలిపారు. రెండు రోజుల పాటూ ఈ ప్రక్రియ ఉంటుందని.. ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్‌ ఖరారు చేసేందుకు నియమించిన ఏకసభ్య కమిషన్ కూడా త్వరలోనే నివేదిక అందజేస్తుందని కోర్టుకు ఏజీ తెలిపారు. ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తుందని నివేదించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టును కోరారు. అఫిడవిట్ దాఖలు చేసేందుకు అంగీకరించిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను జులై 16కు వాయిదా వేసింది.ఆంధ్రప్రదేశ్‌లో బీసీ జనాభాను లెక్కించకుండానే స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నారని బీసీ సంఘం అధ్యక్షుడు గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ముందుకెళ్లకుండా చూడాలని కోర్టును కోరారు. బీసీ జనగణన చేపట్టి ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏపీలో ఎన్నికలు నిర్వహించాలని లాయర్ యోగేష్ పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిందని కోర్టుకు తెలియాజేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ చేస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సమగ్ర కుటంబ సర్వే పూర్తిచేసి మిగిలిన ప్రక్రియను వేగవంతం చేసింది. బీసీల రిజర్వేషన్‌లపై ఏర్పాటు చేసిన కమిషన్ కూడా త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ఈ రిజర్వేషన్ల అంశం ఒ కొలిక్కి రాగానే.. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఇటు ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి అనిల్‌చంద్ర పునేఠా ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కూడా ఇటీవల కీలక సమీక్షలు నిర్వహించారు. అయితే వచ్చే నెలలో రిజర్వేషన్లు ఖరారు చేసి ఓటర్ల జాబితాల ప్రచురణ, ఇతర ఏర్పాట్లు పూర్తిచేసి సెప్టెంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.