400 మంది సిబ్బంది.. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు.. దట్టమైన భూభాగాన్ని జల్లెడ పట్టే థర్మల్ డ్రోన్లు.. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా విశ్లేషణ.. అడవిలో రహస్యంగా అమర్చిన కెమెరా ట్రాప్‌లు, జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో నింపిన బొమ్మలు.. లక్ష రూపాయల రివార్డు.. కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం గ్రామంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన, చేపడుతున్న చర్యలివి. అయినా ఫలితం లేదు.గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలయ్యాయి.. పాప జాడ మాత్రం కానరావటం లేదు. జ్ఞానేశ్వరి అదృశ్యం, పాప ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్.. ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద గాలింపు చర్యలలో ఒకటిగా మారింది. జూన్ 6న ఘటన.. సుంకర గణేష్, భవాని దంపతులు సీహెచ్ అగ్రహారంలో ఉన్న 50 ఎకరాల పామాయిల్ తోటలో సంరక్షకులుగా పనిచేస్తున్నారు. జూన్ ఆరో తేదీ.. భవానీ వంట పనిలో, గణేష్ ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పాప జ్ఞానేశ్వరి భవానీ వద్ద ఉందని గణేష్.. గణేష్ వద్ద ఉందని భవానీ భావించారు. అయితే కొన్ని గంటల తర్వాత చిన్నారి కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. అయితే అదే రోజు మధ్యాహ్నం, ఆ ఊరికి చెందిన ఓ వ్యక్తి జ్ఞానేశ్వరిని కొండ సమీపంలో, పెంపుడు కుక్కతో పాటుగా చూశానని చెప్తున్నారు. చిన్నారి దగ్గరకు వెళ్లి ఇంటికి తీసుకురావడానికి ప్రయత్ని్స్తే.. కుక్క తీవ్రంగా ప్రతిఘటించిందని తెలిపారు. ఆ తర్వాత అతను జ్ఞానేశ్వరి కుటుంబానికి ఆ విషయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత నుంచి జ్ఞానేశ్వరి ఇంకెవరికీ కనిపించలేదు. పాప కనిపించకుండా పోయిందనే ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 40 మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. వీరంతా చెరువులు, గుంటలు, ఆ చుట్టపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. అలాగే దట్టమైన అడవిలో దారి చూపేందుకు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ నుంచి అటవీ శాఖ నిపుణులను రప్పించారు. థర్మల్-ఇమేజింగ్ డ్రోన్లతో రాత్రి వేళ ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. 38 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. 170కి పైగా ఫోన్ రికార్డులను విశ్లేషించారు, కానీ.. ప్రయోజనం లేకపోయింది.జూన్ 9న అనుకోని ఘటన.. జూన్ 9న అనుకోని ఘటన చోటుచేసుకుంది. జ్ఞానేశ్వరి అదృశ్యమైనప్పుడు ఆమెతో ఉన్నట్లుగా చెప్తున్న పెంపుడు కుక్క ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కుక్క వింతగా ప్రవర్తించింది. ఆహారం తినకుండా, మనుషులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ దూకుడుగా కనిపించింది. అయితే జ్ఞానేశ్వరి అదృశ్యమైన సుమారు గంట తర్వాత, ఆ పెంపుడు కుక్క ప్రధాన రహదారిపై తిరుగుతూ, ఒక ఆలయం దగ్గర కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే సమయంలో పోలీసులు గుర్తించారు. అయితే ఆలయం వద్ద నుంచి ఆ కుక్క ఎక్కడికి వెళ్లింది, రెండు రోజులు ఎక్కడ ఉంది అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్.. అనుకోని విధంగా..ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే .. జ్ఞానేశ్వరి వెళ్ళిందని భావిస్తున్న రహదారికి.. పూర్తిగా భిన్నమైన మార్గం ద్వారా పెంపుడు కుక్క తిరిగి ఇంటికి చేరుకుంది. చిన్నారి ఆచూకీని కనిపెట్టేందుకు ఆ పెంపుడు కుక్కనే కీలక ఆధారంగా పోలీసులు భావించారు. జూన్ 12వ తేదీ ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ కుక్క పండ్ల తోటలు, ఆ చుట్టుపక్కల పరిసరాలలో చాలా కిలోమీటర్లు తిరిగిన తర్వాత బలహీనపడిపోయి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జోక్యం.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ చేసుకున్నారు. 30 మంది సభ్యుల ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందంతో గాలింపు చేపట్టాలని ఆదేశించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.10 రోజుల తర్వాత కూడా ఎటువంటి ముఖ్యమైన ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు దర్యాప్తులో వ్యూహం మార్చారు. ఏదైనా క్రూర జంతువు చిన్నారిని లాక్కెళ్లిందా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో ఉన్న బొమ్మలను తోట ఇనుప కంచెకు ఏర్పాటు చేసి.. జంతువుల కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ కొండపై అడవి జంతువుల జాడలు, కొండచిలువలు సంచరించే సంకేతాలు ఏవీ కనపడలేదు. పలు కోణాల్లో దర్యాప్తు..చిన్నారి అదృశ్యం కేసును పోలీసులు ప్రధానంగా మూడు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా.. ఏవైనా జంతువులు దాడి చేశాయా.. లేదా బావి, గొయ్యి వంటివాటిలో ప్రమాదవశాత్తూ పడిపోయిందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే చిన్నారి కనిపించకుండా పోవటానికి కొన్ని వారాల ముందు.. ఆ సమీపంలో బస చేసిన సంచార జాతుల వారిపైనా దృష్టి పెట్టారు. రైల్వే, బస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ, గతంలో జరిగిన పిల్లల అదృశ్యం కేసుల ఫోన్ నంబర్లతో సరిపోల్చుతున్నారు. అలాగే జీడి పిక్కల కోసం ఆ ప్రాంతానికి వచ్చే వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. స్థానిక పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, అటవీ నిపుణుల భాగస్వామ్యంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఆశలు సన్నగిల్లాయి.. చిన్నారి తల్లి ఆవేదనఅయితే కుక్క తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, తమ కుమార్తె ఆచూకీ కనుగొనడంలో సహాయపడుతుందని ఆశపడ్డామని చెప్తున్నారు. కుక్క చనిపోయాక తమ ఆశలు సన్నగిల్లాయని.. ఇప్పుడు తమకు ఉన్న ఏకైక ఆశ పోలీసులేనంటున్నారు. తమ బిడ్డ ఆచూకీ కనిపెట్టేందుకు వాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారని.. జానూను తిరిగి తమ దగ్గరకు తీసుకువస్తారని నమ్ముతున్నామని భవానీ చెప్తున్నారు. అయితే పూజలు, క్షుద్ర విద్యల పేరుతో చిన్నారి ఆచూకీ కనిపెడతామని గత రెండు రోజులుగా కొంతమంది వ్యక్తులు తమ ఇంటికి వస్తుండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనపడని జాడ.. పెరుగుతున్న ఊహాగానాలు..మరోవైపు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్తున్నారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని. ప్రతి ఆధారంపైనా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. అయితే గాలింపు కొనసాగుతున్నప్పటికీ.. స్థానికంగా అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారిపై అడవి పందులు దాడి చేసి, ఆమె మృతదేహాన్ని ఎత్తుకుపోయి ఉండవచ్చనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను ఆమె ప్రమాదవశాత్తు తాకి ఉండవచ్చని, కరెంట్ తీగలను ఏర్పాటు చేసినవారు సాక్ష్యాలను దాచిపెట్టి ఉండవచ్చనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే జరిగింది ఇదీ అని చెప్పేందుకు వేటికి కూడా ఆధారాలు లేవు. రెండేళ్ల చిన్నారి అదృశ్యం కేసులో రెండు వారాలుగా జరుగుతున్న దర్యాప్తు ప్రక్రియలో.. చిక్కు ప్రశ్నలే తప్ప సమాధానాలు లేవు. పోలీసులు ఆ చిక్కుముడులను విప్పాలని.. ఈ కేసులో చిన్నారి కుటుంబానికో సమాధానం చెప్తారని ఆశిద్దాం.