ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులో 60 శాతం వాటా విక్రయం.. దుబాయ్ బ్యాంక్ డీల్.. విలువ రూ. 26 వేల కోట్లు!

Wait 5 sec.

Price: భారతదేశ బ్యాంకింగ్ రంగంలో కొంత కాలంగా పెను మార్పులు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనాలు జరిగాయి. పలు చిన్న బ్యాంకులు పెద్ద బ్యాంకుల్లో విలీనమై మెగా బ్యాంకులుగా మారాయి. ఇంకా రీజనల్ రూరల్ బ్యాంకుల్లోనూ ఒకే రాష్ట్రం ఒకే బ్యాంకు విధానాన్ని పాటిస్తోంది. అంటే రాష్ట్రాల్లో ఆర్ఆర్‌బీలు ఒకటికి మించి ఉంటే వాటిని ఒకటిగా చేసింది. ఇటీవల మళ్లీ పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల్లో కేంద్రం వాటా విక్రయం చేపడుతోంది. కొద్ది రోజుల కిందట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాటా విక్రయం చేపట్టగా ఇప్పుడు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో కూడా వాటా విక్రయం కోసం సిద్ధమైనట్లు భావిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థలోనూ విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోంది. గతంలో యెస్ బ్యాంకులో విదేశీ బ్యాంకు వాటా కొనుగోలు చేయగా ఇప్పుడు ఆర్‌బీఎల్ బ్యాంకులోనుూ అదే జరిగింది. ప్రైవేట్ రంగ బ్యాంక్ ఆర్‌బీఎల్ బ్యాంకులో ఏకంగా 60 శాతం వాటాను దక్కించుకుంది దుబాయ్ ఎమిరేట్స్ NBD బ్యాంక్. ఇందుకోసం 2.75 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఇది భారత కరెన్సీలో రూ. 26 వేల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆ మొత్తానికి సమానమైన అంటే రూ. 26,015 కోట్ల విలువైన షేర్లను కేటాయించినట్లు ప్రకటించింది. ఇక నుంచి ఆర్‌బీఎల్ బ్యాంక్ ప్రమోటర్‌గా ఎమిరేట్స్ NBD నే ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ కింద ఒక్కొక్కటి రూ. 280 చొప్పున దాదాపు రూ. 92.91 కోట్ల మేర షేర్లు కేటాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని ఎక్స్చేంజీలకు ఆర్‌బీఎల్ బ్యాంక్ పేర్కొంది. ఇక జూన్ 19న భారత స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయినా ఆర్‌బీఎల్ బ్యాంక్ షేరు దాదాపు 3 శాతం పెరిగి రూ. 379.85 వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ సుమారు రూ. 60 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 379.90 కాగా, కనిష్ఠ ధర రూ. 219.61 గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ స్టాక్ ధర 20 శాతం పెరిగింది. ఇక భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామనేందుకు ఇది నిదర్శనం అని ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ అబ్దుల్లా అల్ ఖాసిం వ్యాఖ్యానించారు.