పీఎం కిసాన్ యోజనతో కలిపి కాకుండా విడిగా అమలుచేయాలని ఏపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. కేంద్రంతో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో మడతపేచీ పెట్టారని షర్మిల విమర్శించారు. తామే ప్రతి రైతుకు 20 వేలు ఇస్తామని, కేంద్రం ఇచ్చేది బోనస్ అని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం రైతులకు చేసిన తీరని అన్యాయమని మండిపడ్డారు. రైతులపై కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే., పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 6 వేలను జత చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి రైతుకి 20 వేలు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని.. లేని పక్షంలో ఇచ్చిన మాట తప్పినందుకు రైతులకు క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. "అన్నదాత సుఖీభవ కాదు దుఃఖిభవ. మూడో ఏడాది సైతం రైతులకు మోసమే. పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు మొక్కుబడి చేశారు. రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని అరకొర విధింపులతో మమ అనిపిస్తున్నారు. రాష్ట్రంలో 80 లక్షల మంది అర్హత కలిగిన రైతన్నలు ఉంటే, ఈ ఏడాది సైతం ఇస్తున్నది కేవలం 46.86 లక్షల మందికే. ముచ్చటగా 30 లక్షల మంది రైతులకు మళ్లీ ఎగనామమే. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం రైతులకు కత్తెరేశారు. మూడో యేడు పథకాన్ని నామమాత్రం చేశారు. సుఖీభవను సగం సగం చేశారు." అని షర్మిల విమర్శించారు. కూటమి ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని ఎగ్గొట్టిందని.. మద్దతు ధరలకు మంగళం పాడిందని షర్మిల మండిపడ్డారు. పంట భీమాకి ధీమా లేకుండా చేశారని.. ఎరువులు ఇవ్వకుండా రైతులను అరిగోస పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్డులు ఇస్తామని చెప్పి 30 లక్షల మంది కౌలు రైతులను కకావికలం చేశారన్న షర్మిల.. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేసిందని మండిపడ్డారు. మరోవైపు కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3,125.47 కోట్లు జమ చేయనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా... కేంద్ర ప్రభుత్వం వాటా రూ.782.55 కోట్లు. అర్హులైన రైతులు జమ చేయనున్నారు.