మాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ చిదంబరం తీసిన నూతన చిత్రం ‘’. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఎలాంటి ప్టార్ క్యాస్టింగ్ లేని ఈ సినిమా నేడు (జూన్ 20) ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ ‘బాలన్ ది బాయ్’ కథ ఏంటి? ఈ చిత్రం థియేటర్లో ఎలాంటి విజయం సాధిస్తుందన్నది ఓ సారి చూద్దాం.కథకన్నూర్ జైలు నుంచి ఈ కథ మొదలవుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడే భర్తను చంపి భార్య (ఫర్జానా) జైలుకి వస్తుంది. జైల్లోనే ఆమెకు కొడుకు పుడతాడు. శిక్షా కాలం ముగిసిన తరువాత తన బిడ్డను తీసుకుని బయటకు వస్తుంది. తమ ఆచూకీ ఎవ్వరికీ తెలియొద్దని ఊర్లు పట్టుకుని తిరుగుతుంటుంది. ఎక్కడా కూడా ఒక చోట స్థిర నివాసం ఏర్పర్చుకోదు. పోయిన ప్రతీ చోటా ఓ కొత్త పేరుతో పరిచయం చేసుకుంటుంది. ఆమెకు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురు కానంత వరకు అక్కడే ఉంటుంది. ఏదైనా తేడా కొడితే అక్కడి నుంచి మకాం మార్చేస్తుంటుంది. అలా ఆమె (ఫర్జానా) ఇందు, మేరీ లూకా, వందన అంటూ పేర్లు మార్చుకుంటూ తిరుగుంటుంది. చివరకు బస్టాండ్‌లో ఓ మతిస్థిమితం లేని స్త్రీ దగ్గర ఓ ఐడీ కార్డ్ తీసుకుంటుంది. అందులో ఉన్న షెర్లీ పేరుతో కొన్ని రోజులు జీవిస్తుంది. అభిజిత్, బెన్నీ, మను అంటూ ఇలా కొడుకు పేరు కూడా రకరకాలుగా మార్చేస్తూ ఉంటుంది. అలా ఓ ఇంట్లో పని చేసినప్పుడు దొరికిన ఆధార్ కార్డుతో వాసుదేవ్ అని తన కొడుక్కి పేరు పెడుతుంది. అలా షెర్లీ తన కొడుకు వాసుదేవ్‌తో కలిసి ముసలావిడను చూసుకునేందుకు ఓ ఇంట్లో కేర్ టేకర్‌గా జాయిన్ అవుతుంది. అక్కడికి వెళ్లిన తరువాత షెర్లీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? తన గతాన్ని వెతుక్కుంటూ వచ్చిన వారిని షెర్లీ ఏం చేస్తుంది?.. అసలు ఈ తల్లీకొడుకులు ఎలా దూరం అవుతారు? మళ్లీ ఎలా కలుస్తారు? ఈ కథలో సిసిలి (సాండ్ర చంద్రన్), పవిత్రన్, అబ్బాస్ (టొవినో థామస్) పాత్రల ప్రాముఖ్యం ఏంటి? చివరకు ఏం జరుగుతుంది?ఓ చిన్న పిల్లాడిని వెంట పెట్టుకుని తిరిగే ఒంటరి స్త్రీని ఎంత మంది ఎన్ని రకాలుగా చూస్తుంటారు.. అవకాశం కోసం ఎంత మంది ఎదురుచూస్తుంటారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జైలు నుంచి వచ్చామంటే బయట ఎలా చూస్తారో తెలిసిందే. పని దొరకడం కూడా కష్టం అవుతుంది. ఇలాంటి సమస్యలన్నీ మనకు ఈ తల్లీకొడుకుల పాత్రలతో చూపిస్తూ వెళ్తుంటారు డైరెక్టర్. ఎక్కడా ఓ చోట ఉండరు.. వాడిన పేరుని మళ్లీ వాడరు. ఇలాంటి వారి జీవితంలో నెక్ట్స్ మినిట్ ఏం జరుగుతుందా? ఏం మలుపులు వస్తాయా? అన్న ఉత్కంఠను రేకెత్తించేలా గ్రిప్పింగ్‌గా చూపించాడు దర్శకుడు.ఫస్ట్ హాఫ్ అంతా తల్లీకొడుకుల ప్రయాణం మీదే సాగుతుంది. ఊర్లు మారుతూ ఉండటం.. మారిన చోటల్లా కొత్త పేర్లు చెప్పుకోవడం వంటి సీన్లతో ఆడియెన్స్ సినిమాలో లీనం అవుతారు. అసలు వీళ్ల స్టోరీ ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? వీరికి ప్రశాంతమైన జీవితం ఎప్పుడు వస్తుంది? అనే పాయింట్స్ ఆడియెన్స్ మదిలో కలిగించేలా తెరకెక్కించారు. ఇంటర్వెల్‌కి కథలో మరో కొత్త మలుపు, కొత్త సమస్య వచ్చి పడుతుంది. ఇక ద్వితీయార్దంలో తల్లీకొడుకుల ఎడబాటు.. అలానే ఆరేడేళ్ల జీవితం ముగియడం, ఈ పిల్లాడి వల్ల పోలీస్ అధికారులైన సిసిలీ, పవిత్రన్ జీవితాలు మారిపోవడం, ఆ పిల్లాడు అబ్బాస్ అనే నేరస్థుడి లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఇలా కథ ఎటెటో వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఇక తల్లి కోసం కొడుకు చేసే ప్రయత్నాలు కదిలిస్తాయి.అబ్బాస్ పాత్రపై ఆడియెన్స్‌కి మధ్యలో కాస్త కోపం వస్తుంది. కానీ చివర్లో అబ్బాస్ పాత్ర మీద ప్రేమ కలుగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమా చాలా వరకు నిదానంగా, నత్తనడకన సాగినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌కి వచ్చే సరికి సినిమా మీద అభిప్రాయం మారుతుంది. అరే మంచి ఎండింగ్ ఇచ్చారే.. ట్విస్ట్ అదిరిపోయిందే అని అనిపించేలా చేస్తారు. టెక్నికల్‌గా చూసుకుంటే విజువల్స్ అబ్బుర పరుస్తాయి. కేరళ అందాల్ని మరింత అందంగా చూపించారు. నేచురల్ లొకేషన్స్ అవ్వడంతో తెరపై ఆ ఫీలింగ్ వస్తుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా అనిపిస్తుంది. ఆర్ఆర్ సన్నివేశాలకు తగ్గట్టుగా చక్కగా ఉంటుంది. మన తెలుగు కమర్షియల్ సినిమాల్లోని ఫాస్ట్ ఫేస్‌ కటింగ్‌గా ఎడిటింగ్‌ అయితే ఉండదు. చాలా స్లో నెరేషన్‌తో సాగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.నటీనటుల విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్‌లో కనిపించే పిల్లాడు అమాయకంగా కనిపిస్తూనే తన తెలివి తేటల్ని చూపిస్తాడు. ఆ పిల్లాడు తెరపై కనిపించినప్పుడల్లా ఏదో ఒక మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. సెకండాఫ్‌లో కనిపించే పిల్లాడు ఎమోషన్స్ చక్కగా పలికించాడు. ఫర్జానా పాత్ర, ఆమె వెరియేషన్స్, లుక్స్ అన్నీ కూడా సహజంగా అనిపిస్తాయి. సిసిలీ, పవిత్రన్, అబ్బాస్ పాత్రలు సినిమాని చూసిన వారికి అలా గుర్తుండిపోతాయి. బామ్మ కారెక్టర్ ఉన్నంత వరకు సినిమాలో నవ్వులు పూస్తాయి. ఇందులో టొవినో థామస్ తప్పా మిగిలిన వారెవ్వరూ తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు.ఓవరాల్‌గా ‘బాలన్ ది బాయ్’ స్లోగా సాగినా చివరకు మంచి ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఓటీటీలోకి వచ్చిన తరువాత ఈ మూవీ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతాయి. ఈ వీకెండ్‌కి ‘బాలన్ ది బాయ్’ మూవీని కూడా మంచి ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు.