: మీరు కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? లేదా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పొచ్చు. అందుకే చాలా మంది ఇందు కోసం హోం లోన్ తీసుకోవాలని చూస్తుంటారు. అన్ని చోట్లా ఒకేలా ఉండవు. వేర్వేరు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, NBFC ఇలా ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా ఉంటాయి. లోన్ మొత్తం, సిబిల్ స్కోరు, ఆదాయం ఇలా పలు అంశాలు హోం లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేస్తుంటాయి. హోం లోన్ అనేది దీర్ఘ కాలం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి కాస్త వడ్డీ రేటు తక్కువగా ఉన్నా పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మెరుగైన వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకును ఎంచుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొంత కాలంగా హోం లోన్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. గత సంవత్సరంలోనే రెపో రేటును ఆర్బీఐ ఏకంగా 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగా చాలా బ్యాంకుల్లో హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. దీంతో చాలా తక్కువ వడ్డీకే హోం లోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా ఇదివరకు ఫ్లోటింగ్ రేటుపై లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ లేదా టెన్యూర్ తగ్గిందని చెప్పొచ్చు. చాలా ప్రభుత్వ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేటుకే హోం లోన్లు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇంకా చాలా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో మరింత తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికంటే తక్కువగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 7.15 శాతం వడ్డీ రేటుకే హోం లోన్ అందుబాటులో ఉంది. మెరుగైన సిబిల్ స్కోరు ఉన్న వారికి తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రూ. 20 లక్షల హోం లోన్ తీసుకుంటే 7.15 శాతం వడ్డీ రేటుకు పదేళ్ల వ్యవధికి నెలకు ఈఎంఐ రూ. 23,377 చొప్పున పడుతుంది. మొత్తం రూ. 8.05 లక్షల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ సంస్థలో 7.25 శాతం నుంచి హోం లోన్లు ప్రారంభమవుతున్నాయి. 20 లక్షల లోన్ తీసుకుంటే పదేళ్లకు ఈఎంఐ నెలకు రూ. 23480 గా ఉంటుంది. టాటా క్యాపిటల్‌లో హోం లోన్ వడ్డీ రేట్లు 7.50 శాతంగా ఉండగా 20 లక్షల రుణం తీసుకుంటే ఈఎంఐ నెలకు పదేళ్లకు రూ. 23740 చొప్పున పడుతుంది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో 7.75 శాతంగా హోం లోన్ వడ్డీ రేటు ఉండగా ఈఎంఐ నెలకు రూ. 24,002 గా ఉంటుంది.