తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ తీవ్రత ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి. నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇటు ఎండ తీవ్రత ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఎండలో తిరగొద్దని సూచించారు.ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.. కానీ వర్షాలు మాత్రం ఇంకా ఊపందుకోలేదు. గతవారం అక్కడక్కడా వర్షాలు పడినా సరే.. మళ్లీ ఆగిపోయాయి. ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా పెద్ద వానలు పడలేదు. ఈ ఏడాది ఏపీపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. జూన్‌లో కూడా వేడిగాలులు కొనసాగుతాయని.. ఎల్‌నినో ప్రభావంతో సెప్టెంబరు వరకు వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణలో దేశానికే ఆదర్శమన్నారు హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. గత రెండేళ్లలో విపత్తు నిర్వహణ వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ సమన్వయంతో ప్రతి విపత్తునూ క్షుణ్ణంగా పర్యవేక్షించి క్షేత్రాస్థాయిలో అప్రమత్తం చేస్తున్నామన్నారు. NDRF, SDRF, ఫైర్ బృందాలు, ఆపదమిత్ర వాలంటీర్లు, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ, శాటిలైట్ ఫోన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సాంకేతికత వినియోగం, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా ప్రాణనష్టం తగ్గించే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 872 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయన్నారు.