పట్టాలెక్కనున్న బుల్లెట్ ట్రైన్లు.. అనంతగిరి, నల్లమల మీదుగా హైస్పీడ్ కారిడార్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో కనెక్టివిటీని పెంచడంతో పాటు పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు, వరంగల్ ఎయిర్‌పోర్టు పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో భాగంగా అధికారులు మొదటగా ప్రతిపాదిత హైదరాబాద్‌-పుణె హైస్పీడ్ కారిడార్‌ పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో కోకాపేట, వికారాబాద్‌లలో రైల్వే స్టేషన్లు వచ్చేలా ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కేవలం సాధారణ స్టేషన్లుగా కాకుండా పర్యాటక ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ పరిధిలో స్టేషన్‌ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు మార్చాలని.. తద్వారా పర్యాటకుల రాకపోకలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు.అనంతరం.. ఐటీ హబ్‌లను అనుసంధానించే అత్యంత కీలకమైన హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్‌ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ మార్గంలో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని మన్ననూరు వద్ద స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. అయితే.. ఈ ప్రతిపాదిత స్టేషన్‌కు స్థానిక అటవీ ప్రాంత గుర్తింపు వచ్చేలా నల్లమల అని పేరు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మార్గంలో మన్ననూరు తర్వాత పర్యాటక పరంగా ఎంతో విశిష్టత కలిగిన సోమశిల వద్ద కూడా మరో స్టేషన్‌ను ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ ప్రతిపాదించినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు.మరోవైపు, చారిత్రక నగరమైన వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ నమూనాలపై ముఖ్యమంత్రి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. వరంగల్ ఎయిర్‌పోర్టు భవన, రన్‌వే డిజైన్లు కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, ఆనాటి చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా అత్యంత అద్భుతంగా ఉండాలని సీఎం సూచించారు. విమానాశ్రయ ప్రవేశద్వారం వద్ద ఒక భారీ ట్రాఫిక్ ఐలాండ్‌ను నిర్మించాలని అందులో కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి, రుద్రదేవుడి కాంస్య విగ్రహాలతో పాటు, కాకతీయుల శిల్పకళా వైభవానికి చిహ్నమైన ఒక భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ఈ విమానాశ్రయం వరంగల్ వచ్చే అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా ఉండాలని స్పష్టం చేశారు.