అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ7 సదస్సులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం సాగుతున్న వేళ లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఇజ్రాయెల్ తీరును అత్యంత క్రూరమైనదిగా పేర్కొన్న ట్రంప్.. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదని, తన వల్లే ఇజ్రాయెల్ నిలబడిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో సమావేశమైన ట్రంప్ ఇజ్రాయెల్‌కు అమెరికా అందించిన మద్దతు గురించి మాట్లాడారు. "అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు.. నా వల్లే ఇజ్రాయెల్ ఉంది. నేను చేసిన పనులు మరే అధ్యక్షుడు చేయలేదు" అని ట్రంప్ పేర్కొన్నారు. "బెంజిమెన్ నెతన్యాహూతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ, లెబనాన్ విషయంలో ఆయన మరింత బాధ్యతగా వ్యవహరించాలి. నేను వారికి చెప్పాను నాకు అది అస్సలు నచ్చలేదు. ఆ దాడులు చాలా ఎక్కువయ్యాయి. అవి క్రూరమైనవి" అని ట్రంప్ అనడంతో ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. హిజ్బుల్లాను ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ సిరియా సాయం తీసుకోవాలని ట్రంప్ సూచించారు. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ - షరాను కూడా ట్రంప్ ఈ సందర్భంగా ప్రశంసించారు. "ఇజ్రాయెల్ అమాయక ప్రజలను చంపకుండా పని చేయలేకపోతే, సిరియానే ఆ బాధ్యత తీసుకోవాలి. ఈ పనిని వారు మరింత మెరుగ్గా చేస్తారు" అని ట్రంప్ అన్నారు. మరోవైపు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన రిపోర్టుల ప్రకారం మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 3,756 మంది మరణించగా.. 11,632 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై కూడా కూడా ట్రంప్ స్పందిస్తూ.. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని మొత్తం అపార్ట్‌మెంట్‌ని కూల్చేయాల్సిన అవసరం లేదని, అక్కడ ఉండేవాళ్లంతా హిజ్బుల్లా సభ్యులు కాదంటూ లెబనాన్‌కు సపోర్ట్‌గా ట్రంప్ మాట్లాడారు. అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పంద సమయంలో ఇజ్రాయెల్‌పై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.