తిరముల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. ముఖ్యంగా లగేజీ డిపాజిట్, డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది. భక్తులు శ్రీవారి దర్శనం, కాలినడక యాత్ర సమయంలో తమతో తీసుకువచ్చే లగేజీ, బ్యాగులు, మొబైల్స్ భద్రంగా ఉంచుకునేందుకు తిరుమలలో, కాలినడక మార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 65 కౌంటర్లు ఉంటే 345 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో భక్తులకు సేవలందిస్తున్నారు. టీటీడీ కల్పించిన ఈ సేవలను భక్తులు ఉపయోగించుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌ల్లో రికార్డు స్థాయిలో 51,38,976 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని డిపాజిట్ చేసుకున్నారు. గ‌తేడాది ఏప్రిల్‌లో 20,75,481 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్రప‌ర‌చుకోగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో 23,15,279 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్రప‌ర‌చుకున్నారు. గతేడాది మే నెల‌లో 23,82,622 త‌మ ల‌గేజీని భ‌ద్రప‌ర‌చుకోగా, ఈ ఏడాది 28,23,697 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్రప‌ర‌చుకున్నారు. అంటే గ‌తేడాది ఏప్రిల్ నెల‌తో పోలిస్తే 2,39,798 ల‌గేజీ డిపాజిట్లు, మే నెల‌తో పోల్చితే 4,41,075 ల‌గేజీ డిపాజిట్లు అత్యధికంగా ఉన్నాయి. టీటీడీ లగేజీ డిపాజిట్ కేంద్రాల్లో భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసే సమయంలో సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్యూఆర్ కోడ్ జెనరేట్ చేసి బ్యాగుపై కోడ్ స్కిక్కర్ వేస్తారు. ఆ తర్వాత లగేజీకి సంబంధించిన సమాచారంతో ఒక స్లిప్ జెనరేట్ చేసి భక్తులకు అందిస్తారు. డిపాజిట్ డెలివరీ సమయంలో డెలివరీ కేంద్రంలో ఆ స్లిప్ సిబ్బందికి చూపితే ఆ నెంబర్ ఆధారంగా లగేజీని సులభంగా గుర్తించి ఒక నిమిషంలోపు లగేజీని భక్తులకు అందిస్తారు. తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వద్ద ఉన్న లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను అధికారిక డిపాజిట్ కేంద్రాల్లో భద్రపరచి, టోకెన్ ఆధారంగా తిరిగి పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. లక్షలాది మంది శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ అందిస్తున్న ఈ సేవలు పూర్తిగా ఉచితం. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలిపిరి కాలినడక మార్గంలో 5 కౌంటర్లు ఉన్నాయి.. 45 మంది సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 15 మంది) విధులు నిర్వహిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో 2 కౌంటర్లు ఏర్పాటు చేశారు.. 10 మంది సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 5 మంది) సేవలు అందిస్తారు. ఈ కేంద్రాల్లో లగేజీ డిపాజిట్ చేసిన భక్తులు తిరుమలలోని డెలివరీ కేంద్రాల్లో సులభంగా తిరిగి పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల కోసం లగేజీ, సెల్ ఫోన్ డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఫ్రీ హాల్ – 8 కౌంటర్లు, 20 సిబ్బంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్– 2 కౌంటర్లు, 12 సిబ్బంది. నారాయణగిరి షెడ్ – 5 కౌంటర్లు, 45 సిబ్బంది. డీడీ హాల్ – 3 కౌంటర్లు, 18 సిబ్బంది. రూ.300 హాల్ – 4 కౌంటర్లు, 36 సిబ్బంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ అప్ స్కానింగ్ (కంపార్ట్‌మెంట్-03) – 2 కౌంటర్లు, 12 సిబ్బంది ఉన్నారు.భక్తుల తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట సమీపంలో ప్రత్యేక డిపాజిట్, డెలివరీ కేంద్రాలు ఉన్నాయి. KKC 1, 2, 3 – 3 కౌంటర్లు, 18 సిబ్బంది (షిఫ్ట్-06). సుపథం కౌంటర్ – 1 కౌంటర్, 6 సిబ్బంది (షిఫ్ట్-02). సీనియర్ సిటిజన్ / దివ్యాంగులు (PHC) – 1 కౌంటర్, 2 సిబ్బంది. VQC-1 మెయిన్ గేట్ (శ్రీవాణి ట్రస్ట్) – 1 కౌంటర్, 6 సిబ్బంది (షిఫ్ట్-02). డిపాజిట్ చేసిన లగేజీని తిరిగి పొందేందుకు ఈ క్రింది డెలివరీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అలిపిరి ఫుట్‌పాత్ డెలివరీ (జీఎన్సీ వ‌ద్ద‌) – 5 కౌంటర్లు, 45 సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 15 మంది), 9,345 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం. శ్రీవారి మెట్టు డెలివరీ (టీబీసీ వ‌ద్ద) – 4 కౌంటర్లు, 12 సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 4 మంది), 2,482 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం.