ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే వితంతు కేటగిరీ పింఛన్లను మంజూరు చేస్తామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌. రాష్ట్రవ్యాప్తంగా వితంతు కేటగిరీలో దాదాపుగా 2.20 లక్షల మంది అర్హులున్నట్లు గుర్తించామన్నారు. వితంతు పింఛన్లకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తు్న్నామని.. ఒకటి, రెండు నెలల్లో వారికి అందిస్తామన్నారు.. వీరికి నెలకు రూ.4వేలు చొప్పున పింఛన్ ఇస్తారు. గత ప్రభుత్వ హయాంలో 9.56 లక్షల మంది పింఛన్లను తొలగించారని ఆరోపించారు మంత్రి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 7,856 పింఛన్లను అనర్హుల కేటగిరీలో తొలగించామన్నారు. దివ్యాంగులు, మిగిలిన ఆరోగ్య పింఛన్లలో ఒక్కటీ తొలగించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5లక్షల మంది పింఛన్లు తీసుకునేవారు చనిపోయారన్నారు మంత్రి . పింఛను తీసుకునే భర్త చనిపోతే వారి భార్యకు వెంటనే స్పౌజ్‌ కేటగిరీ కింద పింఛను అందించామన్నారు. ఇలా 2.45 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో పింఛన్లు తొలగించారని వైఎస్సార్‌సీపీ నేతలు అసత్యప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ మండిపడ్డారు. దేశంలో ఏపీలోనే అత్యధికంగా పింఛన్లు మంజూరు చేస్తున్నామని.. రెండో స్థానంలో ఉన్న తెలంగాణ కంటే రెట్టింపుస్థాయిలో పింఛన్లు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62.34 లక్షల మందికి పింఛన్లు అందజేస్తు్న్నామని.. ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. స్వయం బ్రాండింగ్‌ను డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయస్థాయి మార్కెటింగ్‌కు అనువుగా ఉండేలా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద తొలి విడతగా 100 ఉత్పత్తులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మన డబ్బులు-మన లెక్కలు యాప్‌ ద్వారా డ్వాక్రా రుణవాయిదాల చెల్లింపుల్లో అవకతవకలు జరగవు అన్నారు. నిరుపేద వర్గాల కోసం మండల సమాఖ్యల ద్వారా తక్కువ వడ్డీకే రూ.20 వేల చొప్పున రుణాన్ని అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్నతి పథకం కింద వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు.గత రెండేళ్లలో ఎంఎస్‌ఎంఈ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.1.91 కోట్ల రుణాలు అందించామన్నారు మంత్రి శ్రీనివాస్. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే 60% వృద్ధి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తున్నామని.. ఇప్పటికే 19 పూర్తయ్యాయిన్నారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు త్వరలో రూ.500 కోట్ల ప్రోత్సాహకాలు అందించనున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.