తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వానాకాలం (ఖరీఫ్) సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే సీజన్‌కు గానూ రైతు భరోసా పథకం నిధుల విడుదలకు తక్షణమే సన్నాహాలు చేయాలని వ్యవసాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఈ పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి గానూ మొత్తం రూ.9 వేల కోట్లను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించగా.. ముఖ్యమంత్రి దానికి సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ నిధుల విడుదలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను వ్యవసాయ, ఆర్థిక శాఖలు సంయుక్తంగా సిద్ధం చేసి, జూన్ 18న జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నాయి. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే నిధుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 26న తొలిరోజున రాష్ట్రంలోని మొత్తం 73 లక్షల మంది రైతులకు ఎకరం లోపు ఉన్న భూములకు నేరుగా లబ్ధి చేకూరేలా నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రైతులకు విడతల వారీగా.. సీనియారిటీ ప్రాతిపదికన నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.ఆర్థిక సాయంతో పాటుగా, రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు ఒక సమగ్రమైన, నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట వేసిన తొలి దశ నుంచే రైతుల వివరాలు, పంటల రికార్డులు, దిగుబడి అంచనాలు, డిజిటల్ ల్యాండ్ మ్యాపింగ్, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలోనూ వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. గతంలో ధాన్యం కొనుగోళ్లలో ఎదురైన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా.. రైతులు దళారీల బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాలుకు ప్రభుత్వం ప్రత్యేక బోనస్ ఇస్తున్న నేపథ్యంలో.. దానికి అనుగుణంగా 7 రకాల సన్న వడ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతు వేదికల్లోనే అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలను కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా.. రైతు సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల్లో వీటి పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.