ఏపీ రాజధాని అమరావతి మీదుగా పరుగులు తీయనుంది. ఇందుకు సంబంధించిన హైదరాబాద్- అమరావతి- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్‌ రాజధాని మీదుగానే వెళ్లనుంది. అమరావతికి కొద్ది దూరంలో రావెల వద్ద నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఈ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఉండాలని గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ మేరకు తుది లొకేషన్‌ సర్వే, డీపీఆర్‌ సిద్ధం చేయడం కోసం నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (NHSRCL)కార్యాచరణ చేపట్టింది. కానీ, ఎయిర్‌పోర్ట్‌కు ఆనుకొని కారిడార్ ఎలైన్‌మెంట్‌ ఖరారుచేస్తే.. రాజధాని అమరావతికి, విజయవాడకు దూరంగా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ సమీపం నుంచి గుంటూరు వైపు వెళ్లాల్సి వస్తుందని తాజాగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజధాని నగరానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో తొలుత నిర్దేశించినట్లు అమరావతి మీదుగానే హైస్పీడ్ రైలు కారిడార్‌ వెళ్లేలా డీపీఆర్‌ రూపొందించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.మొత్తం 760.09 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌-అమరావతి-చెన్నై కారిడార్‌ నిర్మితం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో కలిపి 18 స్టేషన్లు నిర్మిస్తారు. తెలంగాణలో 180.32 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కారిడార్‌లో హైదరాబాద్, శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి వద్ద స్టేషన్లు ఉంటాయి. ఇక ఏపీలో 518.54 కి.మీ. పొడవున కారిడార్ కొనసాగుతుంది. ఏపీలోకి ఈ ప్రవేశించే మొదటి స్టేషన్ దాచేపల్లి అవుతుంది. తర్వాత అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి వద్ద నిర్మిస్తారు. తమిళనాడులో 61.23 కి.మీ. కారిడార్‌ నిర్మించనున్నారు. అక్కడ తిరువళ్లూరు, చెన్నై ఔటర్‌ రింగ్‌ రోడ్‌/ మింజూర్, చెన్నె సెంట్రల్‌ స్టేషన్లు ఉంటాయి. పలమనేరు సమీపంలో 11.8 కి.మీ. సొరంగంఇక, చెన్నై-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్‌లో నాలుగు సొరంగాలు నిర్మిస్తారు. చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌ వద్ద 1.73 కి.మీ., బెంగళూరులో రెండు చోట్ల 14.79 కి.మీ. మేర సొరంగ మార్గాలు ప్రతిపాదించగా.. చిత్తూరు జిల్లాలో కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం మీదుగా ఈ కారిడార్‌ వెళ్తుండటంతో పలమనేరు వద్ద అటవీ ప్రాంతంలో 11.8 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మిస్తారు. మొత్తం 306 కిలోమీటర్ల పొడవైన చెన్నై- బెంగళూరు కారిడార్‌‌ తమిళనాడులో 133 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 72 కి.మీ., కర్ణాటకలో 101 కి.మీ. ఉంటుంది. ఈ కారిడార్లలో స్టేషన్లు తమిళనాడులో చెన్నై సెంట్రల్, పూనమల్లె, పరందూరు, ఏపీలో చిత్తూరు, కర్ణాటకలో కోలార్, కొడిహళ్లి, వైట్‌ఫీల్డ్, బయప్పనహళ్లి మొత్తం 7 ఉంటాయి.హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్‌ తిరుపతి ఎయిర్‌పోర్టు మీదుగా, చెన్నై-బెంగళూరు కారిడార్‌ చిత్తూరు మీదుగా వెళ్లనున్నాయి. ఈ రెండికి అనుసంధానం కోసం తిరుపతి- చిత్తూరు మధ్య కారిడార్‌ నిర్మించాలని గతంలో చంద్రబాబు గతంలో సూచించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న నేషనల్ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ అధికారులు.. ఫైనల్‌ లొకేషన్‌ సర్వే, డీపీఆర్‌ తయారీపై దృష్టిపెట్టారు.ఆంధ్రప్రదేశ్‌ మీదుగా వెళ్లే మరో హైదరాబాద్‌-బెంగళూరు మొత్తం పొడవు 597 కిలోమీటర్లు కాగా.. తెలంగాణలో 239 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 264 కి.మీ., కర్ణాటకలో 94 కి.మీ. మేరకు ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్, శంషాబాద్, భారత్‌ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్లు, మన్ననూర్‌/ పెన్మిల, సోమశిల, మనరాష్ట్రంలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం.. కర్ణాటకలో అలిపురా, దేవనహళ్లి, కొడిహళ్లి కలిపి మొత్తం 15 స్టేషన్లు నిర్మించనున్నారు.