తండ్రి ఆస్తిపై హక్కులకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. తండ్రి ఆస్తిపై హక్కులు కోరుకునే వారిపైనే ఆయన రాసిన వీలునామా ప్రామాణికతను నిరూపించాల్సిన బాధ్యత ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ, వీలునామా సందేహాస్పదంగా ఉంటే న్యాయస్థానం సంతృప్తి చెందేలా వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. తండ్రి రాసిన వీలునామా ఆధారంగా ఆస్తిపై హక్కులు కోరుతూ రెండు దశాబ్దాల కిందట దాఖలైన పిటిషన్‌‌పై తాజాగా తీర్పు వెలువరించింది. 2006లో ఈ పిటిషన్‌ దాఖలు కాగా... సుదీర్ఘ కాలం తర్వాత తీర్పు రావడం గమనార్హం.వివరాల్లోకి వెళ్తే.. ప్రభుజీ పతంగే అనే వైద్యుడు తన తండ్రి 1964లో రాసిన వీలునామా ప్రకారం.. పీల్‌ఖానాలోని ఇంటిపై హక్కులు తనకే చెందుతాయంటూ 2002లో సివిల్‌ కోర్టులో దావా వేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. విల్లులో సందేహాలను నివృత్తి చేయడంలో విఫలమయ్యారంటూ 2006లో డిస్మిస్ చేసింది. ఈ నిర్ణయాన్ని డాక్టర్ ప్రభుజీ హైకోర్టులో సవాల్ చేయడంతో జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ బీఆర్ మధుసూదన్‌రావుల ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించింది. వీలునామాను 1964లో తన తండ్రి రాశారని, 1970లో ఆయన, 1999లో తన తల్లి మృతి చెందారని, ఆ తర్వాత అల్మారాలో వీలునామా లభ్యమైందని పిటిషనర్‌ వివరించా. సాక్షులు మరణించడంతో ఒకరి కుమారుడ్ని సాక్షిగా తీసుకొచ్చారు. అయితే, 55 ఏళ్ల వయసులో తన తండ్రి వీలునామా రాయాల్సిన అవసరం లేదని, ఆయన అప్పటికి ఆరోగ్యంగానే ఉన్నారని ప్రతివాదులు ( ప్రభుజీ అక్కలు) కింది కోర్టులోనే వాదించారు. అంతేకాదు, వీలునామా 35 ఏళ్ల తరువాత దొరికిందని రావడం చెల్లదని వాదించారు. హైకోర్టు విచారణ సందర్భంగా జారీచేసిన నోటీసుల వారు స్వీకరించకపోవడంతో పిటిషనర్‌ వాదనలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించింది. ‘‘సాక్షులు విల్లు (వీలునామా) రాసిన వ్యక్తి సమక్షంలోనే సంతకాలు చేశారా? లేదా? అనేది నిరూపించాల్సి ఉంది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 74 ప్రకారం ఉద్దేశం స్పష్టంగా ఉండాలి. ఇండియన్ ఎవిడెన్ష్ యాక్ట్ సెక్షన్‌ 68 ప్రకారం తన సంతకాన్ని సాక్షి ధ్రువీకరించాలి. లేని పక్షంలో అది దస్తూరీయేనన్న విషయాన్ని నిరూపించాల్సి ఉంటుంది. ప్రస్తుత కేసులో సంతకం చేసిన సాక్షులు ముగ్గురూ మరణించడంతో వారిలో ఒకరి కుమారుడ్ని తీసుకువచ్చారు. కానీ అతడు సాక్షి కుమారుడే అని చెప్పే ఎటువంటి ధ్రువీకరణ సమర్పించలేదు. పిటిషనర్ తండ్రికి మానసికవైకల్యం ఉన్న మరో కొడుకు, ఆరుగురు కుమార్తెలు ఉంటే.. ఐదుగురు పేర్లు మాత్రమే వీలునామాలో ఉండటం సందేహించాల్సిందే. అన్ని ఏళ్ల పాటు అల్మారాలోని సీల్డ్‌కవర్‌లో అది ఉందని చెప్పడం కూడా సందేహంగానే ఉంది’ అంటూ ఈ అప్పీలును ధర్మాసనం కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.ఈ సందర్భంగా ధర్మాసనంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ‘‘వీలునామా అంటే హిందూ వారసత్వ చట్టం 1925 సెక్షన్‌ 2 (H) ప్రకారం ఓ వ్యక్తి తన మరణానంతరం ఆస్తికి సంబంధించి హక్కుదారులను చట్టపరంగా ప్రకటించడం. జీవితకాలంలో అతడు సంపాదించిన ఆస్తులను పంపిణి చేనే పత్రం. రాసే వ్యక్తి ఉద్దేశానికి సంబంధించి చట్టబద్ధమైన ప్రకటన అయి అది అతడి ఆస్తికి చెందిందై ఉండాలి.. తన జీవిత కాలంలో వీలునామాను రద్దు చేసే సౌలభ్యం ఉంటుంది. దీని ప్రభావం రాసిన వ్యక్తి మరణంపై ఆధారపడి ఉంటుంది.. వీలునామా ఇద్దరు వ్యక్తుల మధ్య ఆస్తి బదిలీ కూడా కాదు. ఇది వారసత్వ క్రమాన్ని క్రమబద్ధీకరిస్తుంది... దీనిని కనీసం ఇద్దరు వ్యక్తులతో ధ్రువీకరించాలి. విల్లు రాసిన వ్యక్తి స్వయంగా సంతకం చేసినట్టు, వేలిముద్రను వేసినట్టు సాక్షి చూసి ఉండాలి. ఆయన సమక్షంలో, అతడి ఆదేశం మేరకు మరొకరు సంతకం చేయడమూ చూసి ఉండాలి... వీలునామా రాసిన వ్యక్తి సమక్షంలోనే సాక్షులందరూ సంతకాలు చేయాలి’’ అని వ్యాఖ్యానించారు.