బంగ్లాదేశ్‌లో హై అలర్ట్.. షేక్ హసీనా పార్టీ మళ్లీ రంగంలోకి? అవామీ లీగ్ వార్షికోత్సవం ముందు ఉద్రిక్తత!

Wait 5 sec.

బంగ్లాదేశ్‌లో మళ్లీ అలజడులు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ఆ దేశ నిఘా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. పార్టీ మద్దతుదారులు నిరసనలు, ర్యాలీలు నిర్వహించి దేశంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో.. ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. అవామీ లీగ్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జూన్ 23న జరగనుంది. 2024 ఆగస్టు 5న విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన జూలై అప్‌రైజింగ్ ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ వెంటనే తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత మళ్లీ అవామీ లీగ్ బంగ్లాదేశ్‌లో తన ఉనికిని చాటేందుకు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని వాడుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ హోం మంత్రి సలావుద్దీన్ అహ్మద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జూన్ 23న అవామీ లీగ్ అశాంతి, అస్థిరత సృష్టించే ప్రయత్నాలు చేయవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయని తెలిపారు. అవామీ లీగ్‌ను రాజకీయ పార్టీగా కాకుండా మాఫియా సంస్థగా పరిగణిస్తున్నట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి కామెంట్స్ చేశారు. అవామీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు అప్రమత్తతో ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. శాంతిభధ్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పారు. అయితే, ఇప్పటివరకు అవామీ లీగ్ తన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పోలీసులు కూడా ఈ వ్యవస్థాపక దినోత్సవంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండాలు ఎగరవేయడం, బ్యానర్లతో ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల ఆధ్వర్యంలోని నేషనల్ సిటిజన్ పార్టీ కార్యకర్తలతో ఘర్షణలకు దారి తీయొచ్చు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.