వైద్య విద్యార్థుల ఆశలను మోస్తున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌కు భారత్ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, 5454 సెంటర్లలో ఆదివారం పరీక్ష రాయనున్నారు. ఈ సారి విద్యార్థులతో పాటు అధికారులు, ప్రభుత్వానికి కూడా ఇది పరీక్షే అని చెప్పొచ్చు. పేపర్ లీక్ అంశం తర్వాత కేంద్రం పటిష్ట భద్రత నడుమ ఈ పరీక్షను ఓ సవాల్‌గా తీసుకుని నిర్వహిస్తోంది. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన సంగతి తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. తీవ్ర ఒత్తిడి రావడంతో కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్ష వివరాలునీట్ రీ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుంది. దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం సాయంత్రం 6:20 గంటల వరకు అవకాశం ఉంది. 2 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం కానున్నప్పటికీ విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటలలోపు అంటే కనీసం అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎగ్జామ్ సెంటర్‌కి వస్తే అనుమతించరు. ఈ పరీక్లకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఒక ఫొటో ఐడీ కార్డు ఉదాహరణకు ఆధార్, ఓటు గుర్తింపు కార్డులు లాంటివి కచ్చితంగా తీసుకుని రావాలి. వాటితో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని ఎన్‌టీఏ సూచించింది. పేపర్ లీక్‌కు ఎలాంటి అవకాశం ఉండకుండా ఉండేందుకు ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రశ్నాపత్రాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ద్వారా విమాన మార్గంలో ఎగ్జామ్ సెంటర్లకు తరలించనున్నారు. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో 5,400 సెంటర్లలో, విదేశాల్లో 14 కేంద్రాలు మొత్తం 5454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. భద్రత కోసం 1,38,560 సీసీటీవీ కెమెరాలు, 51,311 జామర్లు, 38,795 ఫ్రిస్కింగ్ సిబ్బంది, 48,448 బయోమెట్రిక్ సిబ్బందిని నియమించారు.