అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద చర్చలు మొదలవుతున్న సమయంలో ట్రంప్ ఓ అల్టిమేటం జారీ చేశారు. వంద రోజులకు పైగా సాగిన యుద్ధంలో ఇరు దేశాలు నష్టపోయాయి. మొత్తానికి ఎట్టకేలకు శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆదివారం నుంచి స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా - ఇరాన్ మధ్య 60 రోజుల తాత్కాలిక కాల్పుల ఒప్పందం జరిగింది. ఈ గడువులోపు ఇరు దేశాల మధ్య శాశ్వత ఒప్పందం కుదరాలి. ముఖ్యంగా అణు చర్చలు సఫలమవ్వాలి. ఈ చర్చలు విఫలమైతే మళ్లీ కథ మొదటకే వస్తుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలోనూ, ఆ గడువు ముగిసిన తర్వాత కూడా హార్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలపై ఎలాంటి టోల్ వసూలు చేయబోమని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్‌తో జరిగే అణు చర్చలు విఫలమైతే అమెరికానే స్వయంగా టోల్ విధిస్తుంది అంటూ హెచ్చరించారు. "కాల్పుల విరమణ అమలులో ఉన్న 60 రోజుల పాటు హార్మూజ్ జలసంధిలో ఎలాంటి టోల్ ఉండదు. ఆ తర్వాత కూడా ఉండదు. అయితే చర్చలు విఫలమైతే అమెరికా టోల్ విధించొచ్చు" అని ట్రంప్ తన సోషల్‌మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అమెరికా-ఇరాన్ చర్చలుస్విట్జర్లాండ్ వేదికగా పాకిస్తాన్ మీడియాటింగ్‌లో అమెరికా - ఇరాన్ మధ్య సాంకేతిక స్థాయి చర్చలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల్లో ఖతార్ ప్రతినిథులు కూడా పాల్గొననున్నారు. తాత్కాలిక ఒప్పందం 60 రోజుల్లో అణు ఒప్పందం కుదరాలి. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. అయితే ఇరాన్ మాత్రం హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేసినట్లు ప్రకటించింది. అమెరికా తన హామీలను ఉల్లంఘించిందని దాంతో హార్మూజ్‌ను మూసివేసినట్లు ఇరాన్ సంయుక్త కమాండ్ ప్రకటించింది. యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయడంలో అమెరికా విఫలమైందని ఇరాన్ ఆరోపిస్తుండగా.. ఇరాన్ వ్యాఖ్యలను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండిస్తోంది.