తిరుమల శ్రీవారి ప్రసాదాలపై కీలక నిర్ణయం.. దేశంలో తొలిసారి ఇలా.. టీటీడీ, CSIR-CFTRI కీలక ఒప్పందం

Wait 5 sec.

తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ, పంపిణీ ప్రక్రియకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. టీటీడీ శ్రీవారి ప్రసాదాల అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్ధారించడంతో పాటు వాటి సంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు.. మైసూరుకు చెందిన CSIR-Central Food Technological Research Institute తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో నిర్వహించిన RISE Conclave-2026 (Research, Innovation, Start-ups And Entrepreneurship) సదస్సులో ఒప్పందం చేసుకున్నారు. టీటీడీ తరఫున ప్రోక్యూర్మెంట్ జీఎం ఉమా శంకర్ పాల్గొన్నారు.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దేశంలోని దేవాలయాలకు సంబంధించి ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి. 'ముడి పదార్థాల కొనుగోలు నుంచి ప్రసాదాల తయారీ, పంపిణీ వరకు కఠినమైన నాణ్యత ప్రమాణాలు, ప్రామాణిక విధానాలు అమలు చేస్తారు. నిల్వ, కొనుగోలు, పరీక్షల ప్రక్రియల్లో శాస్త్రీయంగా నిర్ధారిత సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టి కలుషిత ప్రమాదాలను తగ్గిస్తారు. రుచి, నాణ్యత, సంప్రదాయ విలువలకు భంగం కలగకుండా ప్రసాదాల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్యాకేజింగ్, పరిశోధన చర్యలు చేపడతారు. టీటీడీ ఆహార విశ్లేషకులు, సంబంధిత సిబ్బందికి ఆధునిక పరీక్షా విధానాలు, నమూనాల సేకరణ, కలుషిత పదార్థాల గుర్తింపు, నెయ్యి స్వచ్ఛత నిర్ధారణ వంటి అంశాల్లో శిక్షణ అందిస్తారు. సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్తలు టీటీడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి సాంకేతిక సూచనలు, పరిశోధన ఆధారిత సహకారం అందిస్తారు. ఈ ఒప్పందం ద్వారా శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, పోషక విలువలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు భక్తులకు మరింత విశ్వసనీయమైన సేవలు అందించే అవకాశం కలుగనుంది' అని టీటీడీ తెలిపింది.పుష్పయాగం కార్వేటినగరం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో సోమవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా, భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. పుష్పాల పరిమళాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, భక్తులు స్వామివారి దివ్యానుగ్రహాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేసి విశేషంగా పూజలు సమర్పించారు.అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరం, రోజా, తామర, కలువ, మొగలిరేకులు తదితర పది రకాల పుష్పాలు, మూడు రకాల పవిత్ర పత్రాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. పుష్పాల అలంకారంతో శోభాయమానంగా దర్శనమిచ్చిన ఉత్సవమూర్తులను దర్శించిన భక్తులు తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాలలో తెలిసీ తెలియక సంభవించిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని, ఈ మహోత్సవం ద్వారా సమస్త దోషాలు నివృత్తి చెంది లోకక్షేమం, భక్తుల శ్రేయస్సు కలుగుతాయని ఆలయ అర్చకులు వివరించారు.పుష్పయాగం అనంతరం స్వామి, అమ్మవార్లు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు మంగళదర్శనం ప్రసాదించనున్నారు.